లీడర్ కాదు.. ఆర్డీవో..
దేవుడు కరుణిస్తే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కి మంచి పదవి వస్తుంది. ముఖ్యమంత్రి చెన్నూర్ ఎమ్మెల్యే కు మంచి పదవి ఇవ్వాలీ. దేవుడు కరుణిస్తే ఎమ్మెల్యే వివేక్ గొప్ప పదవి లో చేరుతారూ.. ఇదంతా తమ నేత, నాయకుడు, ఎమ్మెల్యే కోసం ఇంకో నాయకుడు మాట్లాడారని అనుకుంటున్నారా…? అయితే మీరు పప్పులో కాలేసినట్టే.. ఈ వ్యాఖలు చేసింది ఏ రాజకీయ నాయకుడు.. ప్రజాప్రతినిధి కాదు.. ఓ అధికారి…
నేతల ప్రాపకం కోసం అధికారులు పాకులాడటం కొత్తేమీ కాదు.. అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తారని కొందరి పై తరచూ ఆరోపణలు రావడం కూడా చూస్తుంటాం…
కొందరు అధికారులు తమ స్వామి భక్తి బయటకు ప్రదర్శిస్తారు కూడా.. కొంతమంది అధికారులు తమలోని భావాలను పంచుకునేందుకు అధికారికంగా నిర్వహించే వేదికలనే ఆలంబనగా చేసుకుంటున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. మంచిర్యాల జిల్లాలో ఆర్డీవో సమీక్షా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట్ వైరల్ అవుతున్నాయి. స్థానిక ఆర్డీఓ శ్రీనివాస రావు ఆదివారం చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందిరమ్మ కమిటీల సమీక్షలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రసంగించిన ఆర్డీఓ శ్రీనివాస్ రావు వ్యాఖ్యలు అధికార వర్గాల్లో, రాజకీయ పార్టీల్లో సరికొత్త చర్చకు దారి తీశాయి. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక విషయంలో పారదర్శకత పాటించాలని ఎమ్మెల్యే వివేక్ ఆదేశించారని అదే విధానంతో ముందుకు సాగుతామని చెప్పారు.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అదే హుషారులో దేవుడు కరుణిస్తే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కి మంచి (మంత్రి)పదవి ఇవ్వాలని ఆర్డీఓ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చెన్నూర్ ఎమ్మెల్యే కు మంచి పదవి ఇవ్వాలన్నారు.. దేవుడు కరుణిస్తే ఎమ్మెల్యే వివేక్ గొప్ప పదవి లో చేరుతారనీ అన్నారు. పదవి వస్తే చెన్నూర్ కు మంచి జరుగుతుందని స్పష్టం చేశారు. అందుకోసం దేవుడు, సీఎం సహకరించాలన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యే వివేక్ సభా వేదిక పైనే ఉన్నారు. ఆర్డీఓ మాటలు వింటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండి పోయారు.
ఎమ్మెల్యేకు ఉన్నత పదవులు రావాలని ఆకాంక్షిస్తున్నానన్న వ్యాఖ్యలు ఎక్కువగా రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేల అనుచరులు పార్టీ కార్యకర్తలు చెప్తుంటారు. కానీ ఆర్డీఓ స్థాయి అధికారి ఎమ్మెల్యే గొప్ప పదవిలో ఉండాలని కోరుకుంటున్నట్టు ఓ సమావేశంలో మాట్లాడటం చర్చనీయంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మినిస్టర్ పదవి కోసం నేతలు పోటీ పడుతుంటే ఆర్డీవో వ్యాఖ్యలు జిల్లాలో తీవ్ర సంచలనంగా మారాయి.ఒక ఎమ్మెల్యే కి ఒక పార్టీకి మద్దతుగా ఓ ఆర్డీఓ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర చర్చ సాగుతోంది.