మా ఎమ్మెల్యే ఏ పార్టీలోకి పోతడో తెల్వదు..
Chennur:మా ఎమ్మెల్యే ఏ పార్టీలోకి పోతడో తెల్వదు.. ఆయన TRS లోకి పోతున్నడా..? బీజేపీ లోకి పోతున్నాడా..? అనే అనుమానాలు ఉన్నాయి.. అని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌పై కాంగ్రెస్ పార్టీకే చెందిన మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి మాట్లాడటం కలకలం రేపుతోంది. సొంత పార్టీలోనే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా మాట్లాడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతుండగా ఈ వ్యవహారం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది… ఇంతకీ ఏం జరిగిందంటే…
వారం రోజుల కిందట చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంస్థాగత ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు గొడవ పడ్డారు. రెండు వర్గాల మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అనే వరకూ వెళ్లింది. ఈ సమావేశంలో పీసీసీ సభ్యుడు రఘునాథరెడ్డి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజి రెడ్డి వర్గానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వీరిద్దరూ ఒకరిపై ఒకరు తోసుకున్నారు. వ్యక్తిగత దూషణలకు సైతం దిగారు. రాష్ట్ర పరిశీలకుల ముందే ఏకంగా ఎమ్మెల్యేను విమర్శిస్తూ మూల రాజిరెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు.
మా ఎమ్మెల్యే ఏ పార్టీలోకి పోతడో తెల్వదు.. ఆయన TRS లోకి పోతున్నడా..? బీజేపీ లోకి పోతున్నాడా..? అనే అనుమానాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. వారం రోజుల కిందట జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో శనివారం అన్ని గ్రూపుల్లో హల్చల్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత.. కాంగ్రెస్ ఎమ్మెల్యేను విమర్శించడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మూల రాజిరెడ్డి అలా వ్యాఖ్యనించడం వెనక చాలా కారణాలు ఉన్నాయని ఓ వర్గం చెబుతోంది.
మూల రాజిరెడ్డి ఇసుక మాఫియా, బియ్యం దందా, కబ్జాల వ్యవహారాల్లో వేలు పెడుతున్నారని అది నచ్చని ఎమ్మెల్యే ఆయనను దూరం పెట్టారని చెబుతున్నారు. మొన్నటి వరకు ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఎమ్మెల్యేకు నచ్చలేదని… తనను దూరం పెట్టడంతో మూల రాజిరెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పలువురు కాంగ్రెస్ నేతలే చెబుతుండటం గమనార్హం. ఈ వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో ఏకంగా ఎమ్మెల్యేపైనే విమర్శలు చేసిన రాజిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌లోని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది.
రెండు వర్గాలుగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో చూడాలి మరి…