ఎమ్మెల్యే బరిలో కవితక్క..
-ఇప్పటినుంచే రంగం సిద్ధం
-రెండు నియోజకవర్గాల్లో కసరత్తు చేస్తున్న అనుచరవర్గం
- రంగంలోకి పనులు మొదలు పెట్టిన నాయకులు
-అధినేత్రికి పూర్తి స్థాయిలో నివేదిక అందచేత
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత ఎమ్మెల్యే బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారా..? ఆమె ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారా..? ఆ రెండు నియోజకవర్గాల్లో తన అనుచరవర్గానికి పురమాయించారా..? ఇప్పటికే వారు రంగంలోకి దిగి పనులు మొదలు పెట్టారా..? పాత వారిని దారిలోకి తెచ్చుకునే పనిలో పడ్డారా..? ఇంతకీ ఆ రెండు నియోజకవర్గాలు ఏంటి..? వాటిపైనే కవిత కన్నేయడానికి కారణం ఏమిటి…?
ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన కవిత ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆమె రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దిగటం ఖాయమని చెబుతున్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత.. రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసేలా.. రాష్ట్రప్రజలతో మమేకం అయ్యేందుకు వీలుగా ఎమ్మెల్యే కావాలని ఆమె భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే అయితే.. రాష్ట్ర రాజకీయాల్లోకి నేరుగా ఇన్ వాల్వ్ కావొచ్చన్న ఆలోచనలో కవితక్క ఉన్నట్లుగా చెబుతున్నారు. తన ప్లాన్ అమల్లో భాగంగా ఆమె ఇప్పటికే రెండు నియోజకవర్గాలపై కన్నేశారు.
ఆ రెండు నియోజకవర్గాలు ఇవే…
గతంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని భావించిన కల్వకుంట్ల కవితకు అది సాధ్యం కాలేదు. ఓ మారు ఎంపీగా, మరో మారు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. గత ఎన్నికల్లోనే ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అంతా భావించారు. మంచిర్యాల, నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అది సాధ్యం కాలేదు. మంచిర్యాల సిట్టింగ్ నడిపెల్లి దివాకర్‌రావుకు, నిజామాబాద్ బిగాల గణేష్ గుప్తాకు టిక్కెట్టు ఇచ్చారు. అయితే, ఈసారి కూడా ఈ రెండు నియోజకవర్గాలపై కవితక్క గురిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏ ఒక్కదాంట్లో నుంచైనా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
రంగంలోకి కవితక్క మనుషులు..
అయితే, ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాల్లో కవితక్క మనుషులు రంగంలోకి దిగి పని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తనకు ఉన్న పాత పరిచయాలతో పాటు, జాగృతి సభ్యులను సైతం కవిత రంగంలోకి దించారు. కోల్‌బెల్ట్ ప్రాంతంలో సమస్యలు ఏంటి..? మంచిర్యాల ప్రాంతంలో ఉన్న నేతల్లో లోపాలు ఏంటి..? ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి..? ఇంతకీ ప్రజలు ఏం కోరుకుంటున్నారు..? బీఆర్ఎస్, టీబీజీకేఎస్ ఇతర ప్రాంతాలు, బీసీ తదితర కుల సంఘాల నేతల్లో తమకు అనుకూలంగా ఉన్న వారు ఎవరు..? ఇలా అన్ని రకాలుగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంలో కవితకు ఓ నివేదిక కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది బయటకు రాకున్నా క్షేత్రస్థాయిలో తమకు అనుకూలంగా ఉన్నారని ఎన్నికల సమయం వరకు తమకు పూర్తి అనుకూలంగా మారుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని నాయకుడు ఒకరు నాంది న్యూస్‌కు వెల్లడించారు.