ప్ర‌క్షాళ‌న జ‌రిగేనా..?

టీబీజీకేఎస్‌లో ప్ర‌క్షాళ‌న జ‌రుగుతుందా..? అవినీతి నేత‌ల‌ను దూరం పెడ‌తారా…? బీఆర్ఎస్ పుట్టిముంచిన నేత‌ల‌ను ఇంకా కొన‌సాగిస్తారా..? నేత‌ల‌పై కార్మికుల‌కు ఉన్న ఆగ్ర‌హాన్ని త‌గ్గిస్తారా..? ఆ నేత‌ల‌ను దూరం పెట్ట‌క‌పోతే యూనియ‌న్ కార్మికుల‌కు ద‌గ్గ‌ర అవుతుందా..? ఇలా ఎన్నో ప్ర‌శ్న‌లు.. వాటికి అధిష్టానం స‌మాధానం చెబుతుందా..?

తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం(TBGKS).. ఉద్య‌మంలో పురుడు పోసుకుని ఇంతింతై వ‌టుడింతై అన్న‌ట్లు జాతీయ కార్మిక సంఘాల‌కే స‌వాల్ చేసి బ‌రిలో నిలిచిన యూనియ‌న్ అది. ఉద్య‌మ స‌మ‌యంలో చేసిన పోరాటాలు, త‌మ సొంత యూనియ‌న్ అని కార్మికులు అక్కున చేర్చుకున్నారు. అప్ప‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుణ్యం, యూనియ‌న్ నేత మిర్యాల రాజిరెడ్డి మ‌రికొంత నేత‌ల స‌హ‌కారంంతో సింగ‌రేణిలో చాలా హ‌క్కులు సాధించుకున్నారు. ఇక్క‌డి వ‌ర‌కు అంతా బాగానే ఉంది. కానీ, యూనియ‌న్ ఎప్పుడైతే అధికారంలోకి వ‌చ్చిందో.. ఆయా ఏరియాల వారీగా నేత‌లు త‌మ విశ్వ‌రూపం చూపించారు. ఎక్క‌డిక‌క్క‌డ యూనియ‌న్‌ను భ్ర‌ష్టుప‌ట్టించే ప‌నులు చేశారు. దీంతో అక్కున చేర్చుకున్న కార్మికులే ఆ యూనియ‌న్ నేత‌ల తీరు చూసి ప‌క్క‌న పెట్టారు.

కారుణ్య నియామ‌కాల ద‌గ్గ‌ర నుంచి కార్మికుల బ‌దిలీ వ‌ర‌కు..
తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం గెల‌వ‌గానే అవినీతి పెద్దఎత్తున పెరిగిపోయింద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కారుణ్య నియామాకాల ద‌గ్గ‌ర నుంచి కార్మికుల బ‌దిలీల వ‌ర‌కు, క్వార్ట‌ర్ల కౌన్సెలింగ్ ఇలా అన్ని ర‌కాలుగా ఎక్క‌డ చూసినా లంచాలు లేనిదే ప‌ని కావ‌డం లేదని కార్మికులు పెద్ద ఎత్తున దుయ్య‌బ‌ట్టారు. కారుణ్య నియామాకాల్లో రూ. 6 ల‌క్ష‌ల నుంచి రూ. 8 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్లు చేశార‌నే. ఇందులో టీబీజీకేఎస్ నేత‌లే నేరుగా పైర‌వీలు చేస్తున్నారని ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి. ఇక బ‌దిలీల విష‌యానికి వ‌స్తే అందిన‌కాడికి దోచుకున్నారు. ఒక్కో ఏరియాలో ఒక్కో రేటు చొప్పున వ‌సూలు చేశారు. క్వార్ట‌ర్ల కౌన్సెలింగ్‌లో సైతం నాయ‌కులు చెప్పిందే వేదం. వారు చేసిందే చ‌ట్టం అన్న‌విధంగా గ‌నుల‌పై ప‌రిస్థితులు మారాయి.

మ‌హిళా కార్మికుల‌పై లైంగిక వేధింపులు..
మహిళా కార్మికుల ప‌ట్ల తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం(TBGKS) నాయ‌కులు వ్య‌వ‌హ‌రించిన‌ తీరు కూడా పెద్ద ఎత్తున వివాదాల‌కు దారి తీసింది. సింగ‌రేణి సంస్థ‌లో మ‌హిళా ఉద్యోగుల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింది.అదే స్థాయిలో వారిపై లైంగిక దాడులు పెరిగాయి. ఇల్లందు ఏరియా పరిధిలోని కోయగూడెం ఓసీలో పనిచేస్తున్న ఓ కార్మికుడి భార్యను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇల్లందు బ్రాంచ్ ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్లు వేధింపులకు గురిచేశాడు. ఇల్లందు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆర్జీ 1 ఏరియా వ‌ర్క్‌షాప్‌లో టీబీజీకేఎస్ పిట్ సెక్రటరీ స్వామిదాస్ ఓ మ‌హిళా ఉద్యోగిని వేధింపుల‌కు గురి చేశాడు. దీంతో స్వామిదాస్‌ను తోటి కార్మికుల ఎదురుగానే బూటుతో కొట్టింది. విచార‌ణ నేప‌థ్యంలో రాజీప‌డాల‌ని, లేక‌పోతే చంపేస్తామంటున్నార‌ని, సంస్థ‌లో త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని ఒంటిపైన పెట్రోల్ పోసుకొని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి సైతం పాల్ప‌డిందంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు.

అన్నిచోట్ల అదే దుస్థితి..
మంద‌మ‌ర్రి ఏరియాలో ఓ టీబీజీకేఎస్ నేత కారుణ్య నియామ‌కం కోసం త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ఓ యువ‌కుడి భార్య‌పై క‌న్నేశాడు. చివ‌ర‌కు ఆమెను లొంగ‌దీసుకోవ‌డంతో విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చి పెద్ద ర‌చ్చ జ‌రిగింది. రంగంలోకి దిగిన టీబీజీకేఎస్ నేత‌లు, బీఆర్ఎస్ నాయ‌కులు యువ‌కుడికి రూ. 30 ల‌క్ష‌ల వ‌ర‌కు ముట్ట‌జెప్పి విష‌యం స‌ద్దుమ‌ణిగించారు. వారు కూడా రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు మింగేశారు. టీబీజీకేఎస్ నేత‌ను షిఫ్టు మార్పించి చేతులు దులుపుకున్నారు. రామ‌కృష్ణాపూర్ ఏరియా ఆసుప‌త్రిలో టీబీజీకేఎస్ ఫిట్ సెక్ర‌ట‌రీ కృష్ణ ఓ న‌ర్సును లైంగికంగా వేధించాడు. విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌డంతో న‌ర్సు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది.

ప్రక్షాళ‌న చేయాల్సిందే..
ఇలా తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నేత‌ల అవినీతి, అరాచ‌క ప‌ర్వం విష‌యాల్లో కార్మికులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఆ నేప‌థ్యంలోనే గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సింగ‌రేణి ప్రాంతాల్లో అన్ని చోట్ల కార్మికులు బీఆర్ఎస్ కు వ్య‌తిరేకంగా ఓటు వేశార‌ని ఆ పార్టీ నేత‌లే భావిస్తున్నారు. గ‌తంలో ఏ ముఖ్య‌మంత్రి చేయ‌ని విధంగా కేసీఆర్ సింగ‌రేణిలో కార్మికుల హ‌క్కులు నెర‌వేర్చార‌ని, సంస్థ కోసం ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నార‌ని కార్మికులు సైతం అంగీక‌రిస్తారు. కానీ, TBGKS నేత‌ల వైఖ‌రి వ‌ల్ల‌నే ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ ఓట‌మి పాల‌య్యింద‌ని చెబుతారు. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ప్ర‌క్షాళ‌న చేయాల‌ని ప‌లువురు కోరుతున్నారు. ప్రక్షాళ‌న చేయ‌కుండా… యూనియ‌న్‌లో మార్పులు చేయ‌కుండా ముందుకు వెళితే ఎలాంటి ఫ‌లితం ఉండ‌ద‌ని సింగ‌రేణి కార్మికులు చెబుతున్నారు.

యూనియ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ యూనియ‌న్ ప్ర‌క్షాళ‌న చేస్తారా…? లేక అలాగే పాత క‌మిటీల‌తో ముందుకు సాగుతారా..? అనేది తేలాల్సి ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like