మంత్రి ఇలాకాలో యూరియా కష్టాలు
Urea problems in the ministerial constituency:ఓ వైపు యూరియా కొరత లేదని అధికారులు, ప్రభుత్వం చెబుతున్నా రైతులకు మాత్రం యూరియా సక్రమంగా అందడం లేదు. ఏకంగా మంత్రి ఇలాకాలోనే రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వర్షాకాలం సీజన్ కావడంతో రైతులు యూరియా కోసం ఎదురుచూస్తున్నారు. కోటపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు బుధవారం బారులు తీరారు. వర్షంలో మహిళలు, పురుషులు గొడుగులు వెంట తెచ్చుకొని గంటల కొద్దీ నిరీక్షిస్తూ క్యూ కట్టారు. అయితే, రైతులు ఎక్కువగా రావడం స్టాక్ లేకపోవడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. సరిపడా యూరియా స్టాక్ లేకపోవడంతో మండల వ్యవసాయ శాఖ అధికారిని రైతులు నిలదీశారు. అధికారులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చాలా సేపటి తర్వాత ఉన్న స్టాక్ కొద్ది మంది రైతులకు అందచేయగా చాలా మంది రైతులు నిరాశగా వెనుదిరిగిపోయారు.