గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి
Encounter:ఓ వైపు శాంతిచర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్టుల ప్రకటన వెలువడిన ఒక్క రోజులోనే పోలీసులు ఇద్దరు మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేశారు. తాజాగా జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మరణించారు..
మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎటపల్లి తాలూకా పోస్ట్ గట్టా జాంబియా పరిధిలోని మౌజా మొడస్కే అటవీ ప్రాంతంలోని గట్టా దాల్మ్చేలో కొంతమంది మావోయిస్టులు దాక్కున్నట్లు గడ్చిరోలి పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో సి 60, సీఆర్‌పీఎఫ్ బలగాలు అక్కడకు చేరుకున్నాయి. పోలీసు బలగాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు సైతం ఎదురుకాల్పులు జరిపారు. ఎటపల్లి తాలుక జాంబీయ గట్ట పీఎస్ పరిధిలోని అటవీప్రాంతంలో పోలీసులు, మవోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు. జరిగాయి.
కాల్పులు ఆగిపోయిన అనంతరం అటవీ ప్రాంతంలో సోదాలు నిర్వహించగా మొత్తం రెండు మహిళా మావోయిస్టుల మృతదేహాలు, ఒక ఆటోమేటిక్ AK 47 రైఫిల్, ఒక ఆధునిక పిస్టల్, మందుగుండు సామగ్రి, పెద్ద మొత్తంలో మావోయిస్టు సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదర్ జంగిల్ ప్రాంతంలో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.