ఎమ్మెల్యే గారూ… చూడాల‌ని ఉంది సారూ..

బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే వినోద్ గారికి…
వేల శ‌ణార్థుల‌తో…

అయ్యా,

మీరు ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నిల‌బ‌డ‌గానే చాలా సంతోష‌మైంది… గ‌తంలో మంత్రిగా ప‌నిచేసిండ్రు… రాజకీయం మ‌స్తు తెలుసు.. మా ఊళ్లు బాగుప‌డ‌తయ్‌ అనుకున్నం… మీరు మాతోనే ఉండి, మా బాగోగులు, మా ఊళ్ల‌ బాగోగులు చూసుకుంట‌ర‌ని సంబుర ప‌డ్డం… మీరు హైద‌రాబాద్ ఉంట‌ర‌ని ఇక్క‌డ‌కు రార‌ని ప్ర‌తిప‌క్ష‌పోళ్లు చెబితే చిన్న అనుమానం ఉండే… కానీ, ఎన్నిక‌ల్లో మీరు, మీ నేత‌లు, మీ అనుచ‌రులు ఊరు వాడా తిరుగుతూ మా సారూ ఇక్క‌డే ఇల్లు క‌ట్టుకుని ఉంట‌ర‌న్న‌వోళ్లే మాకు అనుమానం ప‌టాపంచ‌లాయే…

మీరు ఇక్క‌డే ఉంటా అన్న‌రు…, బాండ్ కూడా రాసిస్తిరి సారూ…. ఇల్లు కూడా కట్టుకుంటా అంటిరి.. మీరు చెప్పుడే కాదు… మీ ఇంటి ఆడ‌బిడ్డ‌తో కూడా చెప్పిస్తిరి… మా బాపూ ఇక్క‌డే ఉంట‌డు… ఇల్లు క‌ట్టుకుని ఉంట‌డు… చెప్ప‌గ‌నే దాంతోని మాకు ఇంకా సంతోష‌మాయే… మీరు, మీవోళ్లు అంద‌రూ చెప్పినట్టు ఈవీఎంల మీద చేయి గుర్తుకే ఓటేసినం.. మొద‌ట మీరు హైద‌రాబాద్లోనే ఉంటే.. ఇల్లు కాలే క‌దా.. ఆడ ఉంటాండు అనుకున్నం.. రానీకి టైం ప‌డ‌త‌ది అనుకుంటిమి.. కొద్ది రోజులు మంత్రి కొలువు కోసం మ‌స్తు తిరిగివి… మా సారూ మంత్రి అయిత‌డు.. ఇంకేంది మాకేం త‌క్కువ అనుకున్నం.. మా బెల్లంప‌ల్లి ఇంకింత అభివృద్ధి చెందుత‌ద‌ని సంబ‌రప‌డ్డం.. మంత్రి కొలువు కాస్తా మీ త‌మ్ముడు అందుక‌పోయిండు..

ఇప్పుడైనా వ‌స్త‌వ‌నుకుంటే.. రోజులు నెల‌లాయే.. నెల‌లు సంవ‌త్స‌రాలు గావ‌ట్టే.. మీరు మాత్రం బెల్లంప‌ల్లికి చుట్ట‌పుచూపు కింద రావ‌డితిరి… వినోద్ ఇక్క‌డ ఉండ‌డు… హైద్ర‌బాద్‌లనే ఉంట‌డు.. అక్క‌డే తిరుగుత‌డు అని కారు గుర్తోళ్లు చెప్పిన ముచ్చ‌ట‌నే నిజం జేయ‌వ‌డితివి… అప్ప‌డ‌ప్పుడు వ‌చ్చిపోతున్నా ఇక్క‌డ అభివృద్ధి గురించి ప‌ట్టించుకున్న‌వా..? అంటే అది లేక‌పాయే.. పాలిటెక్నిక్ కాలేజీని అప్‌గ్రేడ్ చేయాలే…. బ‌స్ డిపో ఏర్పాటు జేయాలే… బ‌స్టాండ్‌లో మంచి సౌల‌తులు లేవు.. బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణంలో రోడ్లతో జ‌నం త‌కిలీబ్ ప‌డుతున్న‌రు.. ఫుడ్ ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ అలాగే ఆగిపోయాయే. అద‌న్న మొద‌లువెడితే.. మ‌న పోర‌గాండ్ల‌కు కొలువ‌స్త‌ద‌నుకుంటిమి… నాలుగు వేళ్లు నోట్ల‌కు బువ్వ దొరుకుతుంద‌ని అనుకున్నం.. బుగ్గ రాజేశ్వ‌ర‌స్వామి ద‌గ్గ‌ర ప‌ర్యాట‌క కేంద్రం చేస్త‌మంటిరి..? ఆఖ‌రికి దేవుని ద‌గ్గ‌ర కూడా గిట్ల‌నే జేత్తివి సారూ.. ఏం సారూ… గిట్లాంటివి ఎన్నో ఉన్న‌య్‌… మీరేం ప‌ట్టించుకోలేక‌పోతిరి…

ఇక‌, మీరు ఇక్క‌డ లేక‌పోతే మీ అనుచ‌రులు మ‌స్త్ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌రు.. ప్ర‌జ‌ల‌కు మీరు రావాల‌ని ఉన్న‌ది కానీ.. వాళ్ల‌కైతే మీరు ఇక్క‌డ‌కు రాక‌పోతే మ‌స్తు గొడుతున్న‌ట్లుంది.. ఒక్కో మండ‌లానికి ఒక్కో ఎమ్మెల్యే త‌యార‌య్యిండు.. మిమ్మ‌ల్ని క‌ల్వ‌నీకి రావాలంటే ఆళ్ల బండ్ల‌ళ్ల పిట్రోలు పోపియ్యాలే.. తిండి తినిపియ్యాలే.. గొంత ఖ‌ర్చ‌యితా… ఆఖ‌రిని మీ పీఏ కూడా తాగి రోడ్ల మీద డ్యాన్సులు జేయ‌వ‌ట్టే… మీరు ఆయ‌న‌ను ఏం అన‌లేద‌నుకో… కానీ, జ‌నం మాత్రం గిదేందీ గింత దారుణ‌మా..? అనుకుండ్రు.. అయినా అస‌లాయ‌న లేడు క‌దా గిట్ల‌నే త‌యారైత‌రు.. అనుకుండ్రు.. అస‌లు విష‌యం మ‌రిచిపోయినం.. మా లెక్క‌నే మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఎదురుచూస్తుంది.. సింగ‌రేణోళ్లు మంచి ఏ టైప్ క్వార్ట‌ర్ దాదాపు రూ. 20 ల‌చ్చ‌లు వెట్టి కొత్త‌గ చేస్తున్న‌ర‌ట క‌దా… ఎమ్మెల్యేనే వస్త‌లేడు.. రాని మ‌నిషికి ఇంత సౌల‌తులు అవ‌స‌రామ‌ని ముక్కున ఏలేసుకోవాల్సి వ‌స్తోంది సారూ..

చివ‌ర‌గా మీకు జెప్పేది ఒక‌టే సారూ… మీరు ఇక్క‌డ ఉంట‌ర‌నే గెలిపించినం.. మ‌మ్మ‌ల్ని బాగు చేస్త‌ర‌నే ఓటేసినం… మంత్రి రాలేద‌ని అలిగి వ‌స్త‌లేరో..? ఈ జ‌నాలు ప‌ట్టిలేర‌ని వ‌స్త‌లేరో తెల్వ‌దు క‌నీ… మీరు నెల‌కు రెండు. మూడు సార్లు వ‌చ్చిపోండ్రి సారు… లేక‌పోతే మ‌న‌ నియోజ‌వ‌ర్గం అనాథ అయిత‌ది… మ‌ళ్లీ మీకు ఓట్లు ఏయాలంటే మాకు మేమే ఆలోచించుకోవాలే సారూ..

ఇట్లు..
మీ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు..

Get real time updates directly on you device, subscribe now.

You might also like