నిరుద్యోగులను మోసం చేసేందుకే జాబ్‌మేళా
Job fair in Bellampalli :బెల్లంపల్లి పట్టణంలో ఈ నెల 25న నిర్వహించే నిరుద్యోగ జాబ్‌మేళా కేవలం నిరుద్యోగులను మోసం చేసేందుకేనని బీఆర్ఎస్వీ(BRSV) జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ ఆరోపించారు. సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరుద్యోగ జాబ్ మేళాలో ఎన్ని కంపెనీలు పాల్గొంటున్నాయి..? ఎన్ని ఖాళీలు ఉన్నాయి…? నిరుద్యోగులకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలో నిరుద్యోగులకు భోజన సదుపాయం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్(Bellampally MLA Gaddam Vinod) ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎన్నికల ప్రచారంలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని మాట ఇచ్చి ఇప్పటి వరకు వారికి ఉద్యోగాలు కల్పించక పోవడం పట్ల బడికల శ్రావణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేకు ఉన్న విశాఖ ఇండస్ట్రీలో,అంబేడ్కర్ విద్యా సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వొచ్చు కదా..? అని ప్రశ్నించారు. కానీ వారికి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మరోసారి మోసం చేయడానికి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మీ విశాఖ ఇండస్ట్రీలో, మీ విద్యా సంస్థల్లో బెల్లంపల్లి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే BRSV ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.