టోకెన్ల కోసం ఎగబడ్డ రైతులు..
రైతుకు విత్తనం కొనుగోలు దగ్గర నుంచి, యూరియా కోసం, తమ పంట అమ్మడం కోసం కష్టాలు తప్పడం లేదు. రాత్రంతా జాగారం చేసినా కనీసం తమ పంట అమ్ముకునే పరిస్థితి లేదంటే ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు.
సోయా కొనుగోలు చేయాలని అధికారులను ఎన్నిమార్లు కోరినా పట్టించుకోలేదు. చివరకు సోయా కొనుగోలు చేస్తున్నారని తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున కేంద్రాల వద్దకు వచ్చారు. నిర్మల్ జిల్లా కుబీర్, తానూర్ మండల కేంద్రాల్లో ప్రభుత్వం సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో సోయా టోకెన్ల కోసం రైతులు రాత్రి నుంచి సెంటర్ల వద్ద క్యూలైన్లలోనే నిద్రపోయారు. కష్టపడి పండించిన పంటలను అమ్ముకోవడానికి నానా కష్టాలు పడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కుబీర్ మండల కేంద్రంలో సోయా టోకెన్లు ఇస్తున్నారని రైతులు ఉదయం నాలుగు గంటల నుండి కార్యాలయం వద్ద పడి కాపులు కాశారు. టీ, టిఫిన్ చేయడానికి వెళ్ళినప్పుడు రైతులు క్యూ లైన్ లలో చెప్పులు, బండలను పెట్టి వెళ్లారు. అధికారులు టోకెన్లు ఇచ్చే సమయంలో రైతులు ఒక్కరి మీద ఒక్కరు పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి.
అధికారులు టోకెన్లు కూడా సక్రమంగా పంపిణీ చేయకపోవడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.