చిత్ర‌హింస‌లు పెట్టి చంపేశారు..

-చికిత్స కోసం వ‌స్తే ప‌ట్టుకుని చిత్ర‌హింస‌లు పెట్టారు
-కంట్రాక్ట‌ర్లు, క‌ల‌ప వ్యాపారి పాత్ర ఉంది
-లొంగిపోయిన కుసాల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు
-నేత‌లు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి అరెస్టు కాలేదు
-హిడ్మా హత్యలో పార్టీ అగ్రనేత దేవ్‌జీకి సంబంధం లేదు

మావోయిస్టు పార్టీ కేంద్ర క‌మిటీ స‌భ్యుడు, కీల‌క నేత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. హిడ్మాది పూర్తిగా బూటకపు ఎన్‌కౌంటర్ అని, ఆయ‌న‌ను చిత్ర‌హింస‌లు పెట్టి హ‌త్య చేశారంటూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో లేఖ విడుదల చేశారు. హిడ్మా, శంకర్‌ను పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆ లేఖ‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి చెందిన కొందరు కలప వ్యాపారుల ద్రోహం వల్లనే వీళ్ళు దొరికిపోయారని మండిపడ్డారు. అనారోగ్యంతో ఉన్న హిడ్మా, శంకర్‌ చికిత్స కోసం విజయవాడకు వెళ్లినట్లు చెప్పారు.

అనారోగ్యంతో చికిత్స కోసం నవంబర్ 15న విజయవాడ వచ్చిన హిడ్మాను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి, నవంబర్ 18న అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి హత్య చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనలతో పాటు రంపచోడవరం పరిధిలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో మొత్తం 13 మంది మావోయిస్టులు హతమయ్యారని, 50 మందిని అరెస్టు చేశారని తెలిపారు. హిడ్మా కదలికల గురించి లొంగిపోయిన మావోయిస్టు కుసాల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడని కమిటీ ఆరోపించింది. ఈ కుట్రలో విజయవాడకు చెందిన కొందరు వ్యాపారులు, కాంట్రాక్టర్ల పాత్ర కూడా ఉందని తెలిపింది. హిడ్మా హత్యకు మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ కారణమంటూ వస్తున్న ఆరోపణలను ఖండించింది. పార్టీపై జరుగుతున్న కుట్రలో భాగమని పేర్కొంది.

హిడ్మా హ‌త్య‌తో పాటు, నవంబర్ 19న రంపచోడవరంలో శంకర్‌తో సహా మరో 6 మందిని హత్యచేశారని మావోయిస్టు పార్టీ చెప్పింది. మొత్తం 13 మంది మావోయిస్టులు హతమయ్యారు, 50 మందిని అరెస్టు చేశారని పేర్కొంది. అరెస్ట్ అయిన వారిలో మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి లేరని క్లారిటీ ఇచ్చింది. హిడ్మా కదలికలపై ఇది వరకే లొంగిపోయిన పార్టీ సభ్యుడు కుసాల్ పోలీసులకు సమాచారం ఇచ్చాడని చెప్పింది. అంతేకాకుండా విజయవాడకు చెందిన ఓ కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, బిల్డర్‌, అల్లూరిజిల్లాలో ఐటీడీఏ కాంట్రాక్టర్లు ఇందులో కీలక పాత్ర పోషించారని ఆరోపించింది. ఇది ఏపీ పోలీసులు చేసింది కాదని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీల జాయింట్ ఆపరేషన్ అని.. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూత్రధారి ఆరోపణలు గుప్పించింది.

హిడ్మా హత్యతో పార్టీ అగ్రనేత దేవ్‌జీకి కారణమనే ఆరోపణలను మావోయిస్టు పార్టీ ఖండించింది. దేవ్‌ జీ పోలీసులతో ఒప్పందం చేసుకుని మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారనేది అవాస్తవమని చెప్పింది. పోరాట వీరుడిపై నిందలు వేస్తున్నారని చెప్పింది. మావోయిస్టు పార్టీపై కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారని మండిపడింది. మావోయిస్టు పార్టీ సభ్యుల హత్యలపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని, దోషులను శిక్షించాలని డిమాండ్ చేసింది.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like