సీఎం సభలో కంది అనుచరుల అత్యుత్సాహం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇన్‌చార్జీ అనుచరులు హంగామా సృష్టించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (బీజేపీ) మాట్లాడుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జీ కంది శ్రీనివాస్ రెడ్డి ఫ్లెక్సీలు పట్టుకొని కాంగ్రెస్ క్యాడర్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం సభలో కాంగ్రెస్ నియోజక వర్గ నాయకుడి అనుచరుల అత్యుత్సాహం పట్ల పలువురు నిరసన వ్యక్తం చేశారు. ఒకనొక దశలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ తన ప్రసంగం ఆపి, మధ్యలో ఏయ్ బాబు… ఈ గొడవెంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌చార్జీ మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం కలుగచేసుకున్నారు. దీంతో పోలీసులు వారి వద్ద నుంచి ఫ్లెక్సీలను తీసుకుని గొడవ ఆపివేయించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో గురువారం పర్యటించారు. రూ. 500 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీ గొడం నగేష్, ఆదిలాబాద్ ఇన్‌చార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వివేక్, ఎమ్మెల్యే వినోద్, వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ దండే విఠల్ తదితరులు పాల్గొన్నారు.