హామీలు ఇచ్చారు.. అమ‌లు చేస్తున్నారు.. రంగంలోకి కొత్త స‌ర్పంచ్‌లు

ఎన్నిక‌లు అయిపోయాయి… స‌ర్పంచ్‌, వార్డు స‌భ్యులు గెలిచేశారు.. ప్ర‌మాణ‌స్వీకారం కూడా అయిపోయింది. కొన్ని చోట్ల అయితే ఏకంగా స‌ర్పంచ్‌లు, వార్డు స‌భ్యులు రంగంలోకి దిగారు. తాము ఇచ్చిన హామీలు అమ‌లు చేసేస్తున్నారు. కొంద‌రైతే ప్ర‌మాణ స్వీకారం కంటే ముందే తాము ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌డం మొద‌లు పెట్టారు.

సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఓట్ల కోసం ఆకాశమంత హామీలు ఇస్తుంటారు. అయితే గెలిచిన తర్వాత వాటిని పట్టించుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ తెలంగాణలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన కొందరు సర్పంచ్‌లు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పదవిలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తమ నిజాయితీని చాటుకుంటున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ గ్రామాల్లో సరికొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలుకుతున్నారు.

-నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ లో మూడేళ్లుగా కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతులను తరిమికొట్టేందుకు గతంలో ఎన్ని ప్రయత్నాలు చేశారు. అవి ఫ‌లితాలు ఇవ్వ‌లేదు. దీంతో స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో ఇదే ప్ర‌ధాన అంశంగా మారింది. కొత్తగా గెలిచిన సర్పంచ్ రంజిత్ గ్రామ ప్రజలకు కోతుల నుండి విముక్తి కలిగించడం కోసం ఆయ‌నే ఎలుగుబంటి వేషం వేసుకుని గ్రామంలో తిరిగాడు. అలా ఎలుగుబంటి కనిపించడంతో కోతులు పరారయ్యాయి.

-ఆడపిల్ల పుట్టినా… పెండ్లి చేసినా ఐదు వేలు ఇస్తాన‌ని ఓ స‌ర్పంచ్ ఇచ్చిన హామీ నిల‌బెట్టుకున్నారు. గ్రామంలో ఎవరికైనా ఆడపిల్ల పుట్టినా.. ఎవరైనా ఆడపిల్ల పెండ్లి చేసినా రూ.5వేలు అందజేస్తానని హామీ ఇచ్చి సర్పంచ్‌గా గెలిచారు రాజన్న సిరిసిల్ల జిల్లా బస్వాపూర్‌కు చెందిన పుర్మాణి రాజశేఖర్‌రెడ్డి. సోమవారం తన ప్రమాణం చేసిన వెంటనే గ్రామంలో తొమ్మిది మంది ఆడపిల్లల తల్లిదండ్రులకు రూ. 5 వేల చొప్పున ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయించారు. అందుకు సంబంధించిన పత్రాలను ఎంపీడీవో లక్ష్మీనారాయణ చేతుల మీదుగా వారికి అందజేశారు. తన పదవీ కాలం ముగిసేవరకు ఇలాగే అందజేస్తానని ప్రకటించారు.

-హనుమకొండ జిల్లా రంగయ్యపల్లిలో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి 30 లక్షల రూపాయల విలువైన ఎకరం భూమిని.. మరో 10 లక్షల నగదును దాత తిరుపతిరెడ్డి విరాళంగా ఇచ్చారు. రజినిని సర్పంచ్‌గా గెలిపిస్తే ఈ సాయం చేస్తానన్న మాట నిలబెట్టుకున్నారు. ఆమె విజయం సాధించిన వెంటనే తిరుపతిరెడ్డి 30 లక్షల రూపాయల విలువ చేసే తన సొంత ఎకరం భూమిని బతుకమ్మ ఆడుకోవడానికి విరాళంగా అందజేశారు. ఆ స్థలంలో బతుకమ్మ బండ అభివృద్ధి కోసం మరో 10 లక్షల రూపాయలను కూడా ఇస్తానని ప్రకటించారు. గ్రామస్తుల సమక్షంలో ఈ స్థలానికి భూమిపూజ నిర్వహించారు.

-రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరులో సైతం కోతుల బెడ‌ద తీవ్రంగా ఉంది. గ్రామానికి చెందిన చింతలపల్లి విజయమ్మ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తూ సర్పంచ్‌గా గెలిపిస్తే కోతుల బెడద నుంచి విముక్తి చేస్తానని హామీ ఇచ్చారు. విజయం సాధించిన మరుసటి రోజే విజయమ్మ కార్యరూపంలో పెట్టారు. నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి కోతులను పట్టే నిపుణుల బృందాన్ని గ్రామానికి రప్పించారు. సోమవారం 113 కోతులను బోనుల్లో బంధించి అడవికి తరలించారు. గ్రామంలో ఇంకా కోతులు ఉన్నాయని, అన్నింటినీ పూర్తిగా తరలించే వరకు చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

-ప్రమాణ స్వీకారానికి ముందే గ్రామంలోని తాగునీటి సమస్యను తీర్చారు కొత్త స‌ర్పంచ్‌. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచిరామి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఉప్పు తిరుపతి సతీమణి ఉప్పు లక్ష్మి సర్పంచ్ ఎన్నికల్లో గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం మానేరు వాగు నుంచి మంచరామి వరకు తన సొంత ఖర్చులతో పైపులైన్ ద్వారా తాగునీటి సరఫరా చేయించారు. గ‌తంలో కూడా గ్రామస్తులు అవసరాల కోసం అప్పుడు కూడా సొంత ఖర్చులతో పైపులైన్ వేయించారు. వరద రావడంతో పైపులైన్ దెబ్బతిని తాగునీటి సమస్య ఏర్పడింది. గ్రామపంచాయతీ కార్యాలయానికి తన సొంత ఖర్చులతో కలర్స్ వేయించి, అందంగా ముస్తాబు చేయించారు. మంచిరామి నుంచి కనుకుల వరకు రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన పిచ్చి చెట్లను జేసీబీ సాయంతో తొలగించి రోడ్లు వెడల్పు చేయించారు.

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like