ఆరోపణలు నిరాధారం.. ఏ చర్చకైనా సిద్ధం
“నాపై వచ్చిన అన్ని ఆరోపణలు నిరాధారం… ఎక్కడైనా చర్చకు సిద్ధం… నిజానిర్ధారణ కమిటీ ముందు అన్ని ఆధారాలు చూపిస్తా…” — ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
తనపై కొన్ని పత్రికల్లో ప్రచురితమైన కథనాలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, రాజకీయ కుట్రలో భాగంగానే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 450 కోట్ల రూపాయల రుణం, బ్యాంకు బకాయిలు, ఆస్తుల వ్యవహారాలపై పూర్తి వివరాలను వెల్లడిస్తూ అన్ని ఆరోపణలకు సమాధానం ఇచ్చారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సొంత మీడియాతో కాకుండా ఇతర పత్రికల్లో కూడా తనపై అసత్య కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు.
తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తాను ఇసుక, భూముల అక్రమ వ్యాపారాలు చేయాలనుకుంటే అప్పుడే చేసేవాడినని, కానీ అలాంటి పనులకు ఎప్పుడూ దూరంగానే ఉన్నానన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులు, పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
450 కోట్ల రూపాయల వ్యవహారంపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా వాస్తవాలకు విరుద్ధమని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. 2009-10లో సాయినాథ్ ప్రైవేట్ లిమిటెడ్, భాగ్యనగర్ హోటల్స్ పేర్లపై బ్యాంకు రుణాలు మంజూరయ్యాయని, అవి తాను సృష్టించిన పత్రాలు కాదన్నారు. 2014 నుంచి 2025 వరకు కంపెనీ వినియోగించిన మొత్తం నిధులు 109 కోట్ల 11 లక్షల రూపాయలేనని, అన్ని బ్యాంకులు కూడా అదే మొత్తాన్ని ఎన్పీఏగా గుర్తించాయని వివరించారు.
2014 నుంచి 2025 వరకు బ్యాంకులకు 44 కోట్ల 81 లక్షల రూపాయలు చెల్లించామని, ఆంధ్ర బ్యాంక్ ఎన్పీఏ అయిన తర్వాత కూడా 18 కోట్ల 72 లక్షల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. 2024 అక్టోబర్ 31 నుంచి చెల్లింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. 450 కోట్ల రూపాయల మోసం జరిగి ఉంటే బ్యాంకు కేవలం 109 కోట్లకు ఎలా వేలం వేస్తుందంటూ ప్రశ్నించారు.
యూఎస్ ట్రేడింగ్ మార్కెట్ పతనం తర్వాత తాను 160 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశానని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 15 పాఠశాలలు నిర్మించానని, తనపై ఆరోపణలు చేస్తున్న వారు ఎక్కడైనా బహిరంగ చర్చకు వస్తే పూర్తి ఆధారాలతో హాజరవుతానన్నారు. అవసరమైతే నిజానిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసినా అన్ని ఆధారాలు సమర్పిస్తానని స్పష్టం చేశారు.
మంత్రి పదవి చర్చకు వచ్చిన ప్రతిసారి తనపై ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు. జిల్లా నేతలే తనపై కుట్ర పన్నారని, త్వరలో అన్ని కుట్రలు బయటపడతాయని అన్నారు. పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ కోసం పోరాడిన తనపై నిరాధార ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. తాను ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమేనని మరోసారి స్పష్టం చేశారు.