కొమురం భీం కాంగ్రెస్‌లో వర్గపోరు.. గాంధీభవన్ ముట్టడి…
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్ నాయకులు, కార్యకర్తలు గాంధీభవన్‌కు చేరుకుని నిరసన చేపట్టారు. నాన్-లోకల్ డీసీసీ అధ్యక్షుడిని వెంటనే తొలగించి, జిల్లాకు చెందిన స్థానిక నాయకుడికే ఆ బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు.
నిరసనలో పాల్గొన్న కార్యకర్తలు జిల్లా పరిస్థితులు, స్థానిక నాయకత్వంపై అవగాహన ఉన్న వ్యక్తికే డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక నాయకులను పక్కనబెట్టి బయటి వ్యక్తికి బాధ్యతలు అప్పగించడం వల్ల పార్టీ బలహీనపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పార్టీ అధిష్ఠానం వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే జిల్లావ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.