సొంత పార్టీ నేత‌లు, పోలీసులు, అధికారుల‌పై మంత్రి సీరియ‌స్‌

Minister Vivek:కొందరు పార్టీకి ద్రోహం చేశారు… అక్రమార్కులకు అండగా నిలబడి, ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయి… ఇలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోం.. అక్రమాలకు పాల్పడేవారికి అధికారులు, పోలీసులు వత్తాసు పలకడం తక్షణమే ఆపాలి… ఇది ఓ మామూలు నేత మాట్లాడిన మాట‌లు కావు… ఏకంగా ఓ రాష్ట్ర మంత్రి అటు సొంత పార్టీ నేత‌లు, అధికారులు, పోలీసుల‌కు చేసిన హెచ్చ‌రిక‌లు.. ఆయ‌న ఎవ‌రో కాదు… మంత్రి గ‌డ్డం వివేక్‌..

చెన్నూరులో ప‌ర్య‌టించిన మంత్రి వివేక్ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఘాటుగానే స్పందించారు. ఒకవైపు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూనే, మరోవైపు అక్రమాలు, పార్టీకి జ‌రిగిన ద్రోహాలపై గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మంచి మద్దతు ఇచ్చారని అన్న మంత్రి…. కొన్ని స్థానాలలో కావాలని కొంతమంది వ్యక్తులు డబ్బులు ఆశ చూపి పదవులను దక్కించుకున్నారని మండిపడ్డారు. ఇసుక దందా చేసి అక్రమంగా సంపాదించిన డబ్బులతో గెలిచారని వారిది అసలు గెలుపే కాదని ఎద్దేవా చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు కార్యకర్తలు వారికి సహకరించారని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి వారిని హెచ్చరించారు.

ఇక ఇదంతా ఒక్కెత్తు కాగా, అటు అధికారులు, ఇటు పోలీసుల‌కు సైతం ఆయ‌న హెచ్చరిక‌లు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. అధికారులు, పోలీసులు కూడా అక్ర‌మార్కుల‌కు వత్తాసు పలకడం ఇకనైనా ఆపాలని లేకపోతే చర్యలు తప్పవని సూచించారు. చెన్నూరులో ఇసుక మాఫియాకు ఎలాంటి చోటు లేదని మంత్రి తేల్చిచెప్పారు. సొంత పార్టీకి చెందిన వారైనా సరే, అక్రమాలకు పాల్పడితే వదిలిపెట్టేది లేదని గట్టిగా హెచ్చరించారు. ఇలా వివేక్ సొంత పార్టీ నేత‌లు, అధికారులు, పోలీసుల‌ను హెచ్చ‌రించ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. మ‌రి ఆయ‌న ఎవ‌రిని అన్నారు..? భ‌విష్య‌త్తులో ఏం చేయ‌నున్నార‌నేది చూడాలి.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like