ఆ రెండూ దోపిడీ పార్టీలే..

కేసీఆర్‌, రేవంత్‌రెడ్డిపై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ధ్వ‌జం

Union Minister Kishan Reddy:కేసీఆర్(KCR) తెలంగాణను ముంచి పోయాడు… తెలంగాణ ప్రజలను ఆయన బానిసలుగా అనుకున్నాడు కాబట్టి ఆయన ఫారం హౌజ్ కే పరిమితం అయ్యాడు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సైతం ప‌రిస్థితి ఏం మారలేదని ఆ రెండూ దోపిడీ పార్టీలేనంటూ కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి(Kishan Reddy) ధ్వ‌జమెత్తారు. ఆదిలాబాద్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న మాట్లాడారు. బీఆర్ఎస్ నేత కేసీఆర్, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పుణ్యంతో తెలంగాణ‌లో ఆదాయం తక్కువ అప్పులు ఎక్కువ అయ్యాయని దుయ్య‌బ‌ట్టారు.

కేసీఆర్ బంగారు తెలంగాణ  అని ఆయన కుటుంబాన్నీ బంగారం చేసుకున్నారని, దోచుకున్న డబ్బుల కోసం వాళ్ల కుటుంబంలో కొట్లాడుకుంటున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేసీఆర్ కాలంలో వారి కుటుంబం దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవ‌రికి ప‌డితే దొరికితే వారు దోచుకుంటున్నారని దుయ్య‌బ‌ట్టారు. దోపిడి, అవినీతి డీ సెంట్రలైజ్ అయిందన్నారు. మోదీ ప్రభుత్వంలో ఏ రాష్ట్రంలో చూసిన అద్భుతమైన జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందన్నారు. గత 12 సంవత్సరాల్లో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సుమారు లక్ష 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని స్ప‌ష్టం చేశారు.

ఇంకా 80 వేల కోట్ల రూపాయల నిధులతో కొత్త పనులు కొనసాగుతున్నాయన్నారు. ప్రధానమంత్రి వాజ్ పేయి గారి నాయకత్వంలో, గ్రామీణ సడక్ యోజన (PMGSY) ద్వారా నిర్లక్ష్యానికి గురైన గ్రామాలకు రోడ్లు నిర్మించిన‌ట్లు కిష‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈ స్కీమ్ కింద రోడ్ల నిర్మాణం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం జరిగితే ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ వంటి ప్రాంతాలు జాతీయ రహదారులతో అనుసంధానం జరగుతుంద‌ని తెలిపారు. నాగ్‌పూర్–మంచిర్యాల మరియు మంచిర్యాల–విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కూడా జరుగుతుంద‌న్నారు. ఆదిలాబాద్-ఆర్మూర్ కు రైల్వేలైన్ కావాలని చాలారోజులుగా డిమాండ్ ఉంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం సర్వే చేస్తోంది. ఆ సర్వే రిపోర్ట్ వస్తే.. దానిపై కూడా కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనిపై దృష్టి కేంద్రీకరిస్తామ‌న్నారు.

వైద్య రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బస్తీ దవాఖానలు, ఆయుష్ సెంటర్ నుంచి మొదలు ఆసుపత్రుల వరకు అనేక రకాల అభివృద్ధి పనులు చేస్తోంది. గతంలో నిమ్స్ లో రూ. 120 కోట్లు కేంద్ర ప్రభుత్వం, రూ. 30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఆసుపత్రిని ప్రారంభించుకున్న‌ట్లు చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల్లో డయాలసిస్ సెంటర్లు, బస్తీ దవాఖానలు, ఆయుష్ సెంటర్లను నిర్మించిందన్నారు. గతంలో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ తల్లిదండ్రులు అప్పులు చేసి ఆస్తులు అమ్మి ఉన్నత చదువుల కోసం ఇతర దేశాలకు పంపించే పరిస్థితులు ఉన్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ… మనం ఇతర దేశాలకు పోయి నాసిరకం వైద్య విద్యను చదవడం కంటే…మనమే మన దేశంలో మెడికల్ కాలేజీలు పెంచి మన పిల్లలకు ఎంబీబీఎస్ విద్యను అందించి వారి సేవలను వినియోగించుకోవాలని అనేకంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

పత్తి కొనుగోలు విషయంలో చివరి కిలో వరకు ప‌త్తి కొంటామ‌న్నారు. మార్చి నెల వరకు కూడా పత్తి కొనుగోలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని కిష‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. రైతులు ఎంత పత్తి తీసుకొచ్చినా కొనుగోలు చేస్తామ‌న్నారు. మధ్య‌ దళారీలు కొంత ఇబ్బంది పెట్టినా.. రైతులు చైతన్యవంతమయ్యారు. ఇప్పుడు ఆన్ లైన్ లో యాప్ ద్వారా పత్తి అమ్మకం కోసం బుకింగ్ చేసుకుంటున్నారని చెప్పారు. ఆదిలాబాద్ కు జిల్లాకు సంబంధించి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాల కోసం కలిసికట్టుగా ముందుకొస్తోంద‌న్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like