న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
తాత్కాలిక ఆనందం కోసం భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం వేడుకలకు సంబంధించి ఆయన పలు సూచనలు చేశారు. వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని.. కానీ చట్టానికి లోబడి మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. డిసెంబర్ 31 రాత్రి 10.00 గంటల నుంచి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి, బైండ్ఓవర్ చేస్తామని ఆయన హెచ్చరించారు. తీసుకోవడం జరుగుతుంది.
– డిసెంబర్ 31 రాత్రి నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్థానిక పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, షీ టీమ్స్, మఫ్టీ టీమ్స్, స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో కలిసి ప్రమాదాల నివారణకు కృషి చేస్తారని తెలిపారు. అదే సమయంలో అక్రమ సిట్టింగులు, బహిరంగంగా మద్యం సేవించడం, గుంపులుగా తిరుగడం, మహిళలను వేధించడం వంటి సంఘటనలను అరికట్టేందుకు ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.
– నూతన సంవత్సర వేడుకలను అర్థరాత్రి 12.30 గంటల లోపు ముగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతులు పొందాలన్నారు. కార్యక్రమాల్లో అశ్లీల నృత్యాలకు అనుమతి ఉండదన్నారు. వేడుకల ప్రాంగణంలో సీసీ కెమెరాల ఏర్పాటు, సెక్యూరిటీ సిబ్బంది నియామకం తప్పని సరి అని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
-ఆర్కెస్ట్రా, డీజేలు, మైకుల వినియోగం, బాణసంచా పూర్తిగా నిషేధించినట్లు స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
-మద్యం దుకాణాలు, వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు ప్రభుత్వం అనుమతించిన సమయపాలన తప్పని సరిగా పాటించాలని వెల్లడించారు.
-డిసెంబర్ 31 రాత్రి 10.00 గంటల నుంచి నిర్వహించే స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్లో మద్యం సేవించి నిర్లక్ష్యంగా, వేగంగా వాహనాలు నడిపిన వారిని అదుపులోకి తీసుకొని వాహనాలు సీజ్, జరిమానాలు విధించడం, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు , బైండ్ఓవర్ వంటి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
-ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
-యువతపై ఏదైనా కేసు నమోదైతే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల కోసం వీసాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. యువత మద్యం సేవించకుండా జాగ్రత్త వహించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలపై పర్యవేక్షణ ఉంచాలని, అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
-వేడుకల సందర్భంగా ఎలాంటి అపశ్రుతులు జరగకుండా వాహన తనిఖీలు, పెట్రోలింగ్, పికెట్స్, మఫ్టీ టీమ్స్, ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు వంటి ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
-నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిషేధిత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ నూతన సంవత్సర వేడుకలను ప్రజలు, యువత శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, కుటుంబ సమేతంగా తమ ఇళ్లలో సంతోషంగా, చట్టబద్ధంగా నిర్వహించుకోవాలని అంబర్ కిషోర్ ఝా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రామగుండం కమిషనరేట్ ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.