సచిన్ రికార్డు బద్దలు కొట్టి..
ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లలో ఒకడైన విరాట్ కోహ్లీ (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్‌లో మరో ఘనత సాధించాడు. అరుదైన ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మధ్య వన్డేల్లో వరుస సెంచరీలతో రికార్డులు నెలకొల్పిన విరాట్.. ఈసారి 28 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. ఈ క్రమంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టి, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించారు.
విరాట్ కోహ్లీ తన అద్భుత ఫామ్ కొనసాగిస్తూ సరికొత్త రికార్డులు తిరగరాస్తున్నారు. ఆదివారం (జనవరి 11, 2026) న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో 25 పరుగులు పూర్తి చేయగానే, కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌లు కలిపి 28,000 పరుగుల క్లబ్‌లో చేరారు. ఈ మైలురాయిని చేరుకోవడానికి కోహ్లీకి కేవలం 624 ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరమయ్యాయి. ఇంతకుముందు ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 28,000 పరుగులను చేరుకోవడానికి 644 ఇన్నింగ్స్‌లు తీసుకోగా, కోహ్లీ కేవలం 624 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించి 20 ఇన్నింగ్స్‌ల ముందే రికార్డును బద్దలు కొట్టారు. శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర 666 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకుని మూడవ స్థానంలో ఉన్నారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఈ మైలురాయిని చేరుకున్న మూడవ ఆటగాడిగా కోహ్లీ నిలిచారు.
టీ 20లు, టెస్ట్ క్రికెట్‌కు ఇప్పటికే వీడ్కోలు పలికిన కోహ్లీ, తన పూర్తి దృష్టిని వన్డే ఫార్మాట్‌పైనే కేంద్రీకరించారు. 2025లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన కోహ్లీ, అదే ఊపు 2026 ప్రారంభంలోనూ కొనసాగిస్తున్నారు. ఈ మ్యాచ్‌లోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా కుమార సంగక్కర (28,016)ను కోహ్లీ అధిగమించాడు.