జ‌ర్న‌లిస్టుల రిమాండ్ రిజెక్ట్‌

NTV Journalists’ remand rejected ఎన్టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్ సుధీర్‌లను పోలీసు కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు చేసిన అభ్యర్థనను నాంపల్లి క్రిమినల్ కోర్టు తిరస్కరించింది. అదే సమయంలో ఇద్దరు జర్నలిస్టులకు కఠిన షరతులతో బెయిల్ మంజూరు చేసింది.

ఎన్టీవీ ప్ర‌సారం చేసిన ఒక వార్తాక‌థ‌నం విష‌యంలో దొంతు రమేష్‌ హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులతో కలిసి బ్యాంకాక్ వెళ్లే సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు రిపోర్టర్లు సుధీర్, పరిపూర్ణా చారిని కూడా అరెస్ట్ చేశారు. ముగ్గురిని సీసీఎస్ కార్యాలయానికి తరలించి ప్రశ్నించారు. పరిపూర్ణా చారిని ప్రశ్నించి వదిలేయ‌గా…. మిగతా ఇద్దర్నీ కోర్టులో హాజ‌రుప‌రిచారు. జనవరి 14 సాయంత్రం ఇద్దరు జర్నలిస్టులనూ నాంపల్లి కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. పోలీసులు దర్యాప్తు కోసం రిమాండ్ కావాలని కోరారు. అయితే ఎన్టీవీ తరపు న్యాయవాదులు జగదీశ్వర్, కిరణ్, శ్రీనివాస్ రెడ్డి వాదనలు వినిపించారు.

పోలీసులు బాధితులుగా చెబుతున్న వ్యక్తుల స్టేట్‌మెంట్లు ఏమీ లేవని, బాధితులు స్టేట్‌మెంట్ ఇవ్వడానికి ముందుకు రాలేదని వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, దొంతు రమేష్, సుధీర్‌ల రిమాండ్ అభ్యర్థనను తిరస్కరించింది. వారికి బెయిల్ ఇస్తూ కోర్టు నిర్ణ‌యం తీసుకుంది. అదే స‌మ‌యంలో ఇద్దరూ తమ పాస్‌పోర్టులను సరెండర్ చేయాలనీ.. చెరో రూ.20 వేల నగదు బాండ్, ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు తెలిపింది. అలాగే కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ నగరం విడిచి వెళ్లరాదని ఆంక్షలు విధించింది. ఈ షరతులతో ఇద్దరు జర్నలిస్టులకు బెయిల్ మంజూరు చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like