నేడు ఆదిలాబాద్లో ముఖ్యమంత్రి పర్యటన
Chief Minister Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న రేవంత్ రెడ్డి చనాకా-కోర్ట బ్యారేజీ(Chanaka-Korta Barrage), సదర్మాట్ బ్యారేజీ(Sadarmat Barrage) నుంచి నీటిని విడుదల చేస్తారు. నిర్మల్లో బహిరంగ సభలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరాతారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని చనాకా-కోర్ట బ్యారేజీని సందర్శిస్తారు. అక్కడ పంపుహౌస్ ప్రారంభించి ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేస్తారు. అనంతరం అక్కడి నుంచి నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ దగ్గర గత ప్రభుత్వం చేపట్టిన సదర్మాట్ బ్యారేజీ సందర్శిస్తారు. సదర్మాట్ బ్యారేజీ నీటిని విడుదల చేసిన తర్వాత సీఎం నిర్మల్ బహిరంగ సభ నుంచే మున్సిపల్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.
నిర్మల్లో సీఎం పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(Veda Bojju Patel) తీవ్రంగా కృషి చేస్తున్నారు. నిర్మల్, ఖానాపూర్, భైంసా నుంచి పెద్ద సంఖ్యలో జనం సభకు హాజరయ్యేలా నేతలు, కార్యకర్తలతో కలిసి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అదే సమయంలో అధికారులు సైతం ముఖ్యమంత్రి పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. నిర్మల్ బహిరంగసభ మినహా చనాకా-కోర్ట, సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవాలకు మీడియాను అనుమతించడం లేదు.