స్పీకర్‌కు ఇదే చివరి అవకాశం..!
Supreme Court :బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. స్పీకర్‌కు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. నిర్ణయం తీసుకోకుంటే కీలక పరిణామాలు ఉంటాయని వ్యాఖ్యానించింది. స్పీకర్‌కు చివరి అవకాశం ఇస్తున్నామని… రెండు వారాల్లో మిగతా ఎమ్మెల్యేలపై కూడా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని… మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం ప్రకటించారని వివరించారు. స్పీకర్ కంటి ఆపరేషన్ చేయించుకున్నారని.. సెక్రటరీ జనరల్ మారారని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో జాప్యం జరుగుతోందని వాదించారు. మిగిలిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది డీఎస్ నాయుడు వాదనలు వినిపిస్తూ గతంలోనే నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో ఇచ్చిన గడువు పూర్తి అయిపోయిందన్నారు.
ఇక సింఘ్వీ ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మిగతా వారి విషయంలో కూడా నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం…. స్పీకర్ వైఖరి విషయంలో అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని తెలిపింది. స్పీకర్‌కు చివరి అవకాశం ఇస్తున్నామని.. రెండు వారాల్లో మిగతా ఎమ్మెల్యేలపై కూడా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. 4 వారాల సమయం ఇవ్వాలని స్పీకర్ తరపు న్యాయవాది సింఘ్వీ కోరగా… కోర్టు నిరాకరించింది. రెండు వారాల్లోనే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై తీసుకున్న చర్యలపై రెండు వారాల్లో అఫిడవిట్ ఇవ్వాలని సూచించింది.