కాంగ్రెస్ లో చేరి త‌ప్పు చేశా.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

Gudem Mahipal Reddy:తప్పటడుగు వేసి కాంగ్రెస్ పార్టీలో చేరాను. అందులో చేరటం వల్ల నియోజకవర్గ ప్రజలకు గానీ, నాకు గానీ.. వెంట్రుక మందం కూడా లాభం జరగలేదని… పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ ముఖ్య నేత‌ల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు. వచ్చే మున్సిపల్‌ ఎన్నికల్లో BRS అభ్యర్థులను గెలిపించాలని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మూడుసార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచా.. అందులోనే ఉంటే బాగుండేది. అప్ప‌టి ప‌రిస్థితుల వ‌ల్ల కాంగ్రెస్ లో చేరాల్సి వ‌చ్చింద‌ని మ‌హిపాల్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

గ‌తంలో కూడా ఆయ‌న కాంగ్రెస్ పార్టీపై విమ‌ర్శ‌లు చేశారు. కొద్ది రోజుల కింద‌ట గుమ్మడిదల మండలం ప్యారా నగర్ డంప్ యార్డ్ విషయంలో రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలవడానికి గ్రామస్తులు వచ్చారు. మీరు అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా డంప్ యార్డు ఏర్పాటు కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. తాను కాంగ్రెస్ అధికార పార్టీ కాదు పక్కా బీఆర్ఎస్ పార్టీ అంటూ చెప్పిన ఆయ‌న కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి దారుణంగా మాట్లాడారు. నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర్గ విబేధాల నేప‌థ్యంలోనే మ‌హిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఇమ‌డ‌లేక‌పోతున్నారని స‌మాచారం.

ప‌టాన్‌చెరు కాంగ్రెస్‌లో మూడు ముక్క‌లాట‌గా సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హస్తం పార్టీలో మొద‌టి నుంచి అంత కంఫర్ట్ గా లేరు. గూడెం రాకను కాట శ్రీనివాస్ గౌడ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇక గూడెంకు, నీలం మధుకు బీఆర్ఎస్ లోనే పడేది కాదు. గూడెంకు టిక్కెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించే నీలం మధు కారు దిగి కాంగ్రెస్ లో చేరారు. ఇలా ఓవైపు నీలం మధు.. మరోవైపు కాట శ్రీనివాస్ గౌడ్లతో ఎమ్మెల్యే గూడెంకు కాంగ్రెస్ లో మద్దెల దరువు తప్పడం లేదు. దీంతో గూడెం కూడా మనిషిక్కడ, మనసక్కడ అన్నట్లు హస్తం పార్టీలో అంటిముట్టనట్లుగానే ఉంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఆ పార్టీనే ఇష్టం వ‌చ్చిన‌ట్లు తిడుతున్న ఎమ్మెల్యే గూడెం మ‌హిపాల్ రెడ్డిపై అధిష్టానం ఏ మేర‌కు స్పందిస్తుందో వేచి చూడాలి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like