కాంగ్రెస్ సమావేశం రసాభాస
Congress:టిక్కెట్ల కోసం కాంగ్రెస్ నేతలు గొడవ పడ్డారు. ఏకంగా మంత్రి ముందే గొడవకు దిగడంతో ఏం చేయాలో దిక్కుతోచని ఆయన సమావేశం మధ్య నుంచే వెళ్లిపోయారు. ఈ సమావేశంలోనే ఓ దళిత నేతను డీసీసీ అధ్యక్షుడు తోసివేయడం వివాదం మరింత ముదిరేలా చేసింది….
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) సమక్షంలో కాంగ్రెస్ నేతల సమావేశం నిర్వహించారు. క్యాతన్‌పల్లిలోని బీమా గార్డెన్‌లో క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశంలో నేతలు డబ్బులు ఇచ్చిన వారికే టిక్కెట్లు ఇస్తున్నారంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గొడవకు దిగారు. మొదటి నుంచి ఉన్న కార్యకర్తలకు కాకుండా మధ్యలో చేరిన వారికి కౌన్సిలర్ టికెట్లు అమ్ముకుంటున్నారని గొడవకు దిగారు.
దళిత నేతను తోసివేసిన డీసీసీ అధ్యక్షుడు..
ఈ గొడవ ఇలా కొనసాగుతుండగానే వారితో మాట్లాడి సమస్య సద్దుమణిగేలా చేయాల్సిన డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి(DCC President Raghunath Reddy) దళిత సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కళ్యాణ్ ను తోసివేశారు. మాట్లాడుతుంటే అలా తోసివేయడం ఏమిటని పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓ దళిత నేతపై ఇలా ప్రవర్తించడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎన్నో ఏండ్లుగా పార్టీకి సేవ చేస్తుంటే కనీసం ఆశావాహుల్లో కూడా పేరు రాలేదని ఆవేదన చెందారు.
మధ్యలోనే వెళ్లిపోయిన మంత్రి
ఇలా నేతలు ఆందోళనలు, ఆగ్రహాలు వ్యక్తం చేస్తుండటంతో చేసేదేమీ లేక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్యలోనే వెళ్లిపోయారు. నాయకులు అలా గొడవపడుతుంటే చూసి ఏం చేయాలో తెలియక, ఏం చేయలేక ఆయన వెళ్లిపోవడంతో నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ముందు ఇలాంటి ఘటనలతో పార్టీ నష్టపోతుందంటూ స్పష్టం చేశారు.