ఆమె డ్యూటీకి అందరూ ఫిదా
Female Constable Jayashanti:చేతిలో చంటి బిడ్డ ఉన్నా తన కర్తవ్యాన్ని వీడని మహిళా కానిస్టేబుల్ చేసిన పనికి పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భుజాన వేసుకుని కాకినాడలో ట్రాఫిక్ క్లియర్ చేసిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి(Female Constable Jayashanti)పై ప్రశంసలు కురుస్తున్నాయి. కాకినాడ కెనాల్ రోడ్డు భారీగా ట్రాఫిక్ జామ్ కాగా, సుమారుగా ఐదారు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయి.. రాకపోకలు స్తంభించిపోయాయి. ట్రాఫిక్ జామ్‌లో రెండు అంబులెన్సులు చిక్కుకుపోయాయి. అలాగే పురిటి నొప్పులు పడుతున్న ఓ గర్భిణి కూడా ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయింది. దీంతో జయశాంతి తాను విధుల్లో లేకున్నా చంకన బిడ్డతో అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేశారు. దీనిని కొందరు వీడియో తీశారు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ కాగా నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.
మాతృత్వానికి, కర్తవ్యానికి సెల్యూట్ అమ్మా..
మహిళా కానిస్టేబుల్ జయశాంతిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(Hyderabad Police Commissioner VC Sajjanar) ప్రశంసలు కురిపించారు. చంకలో చంటిబిడ్డను పెట్టుకుని.. డ్యూటీలో లేకపోయినా కూడా అంబులెన్స్ కోసం ట్రాఫిక్ క్లియర్ చేసిన ఆమెను అభినందించారు. మాతృత్వానికి, కర్తవ్యానికి సెల్యూట్ అమ్మా అంటూ ట్వీట్ చేశారు. ఓ చేతిలో పేగుబంధం.. మరో చేతిలో సమాజ బాధ్యత.. మాతృత్వానికి, కర్తవ్యానికి సెల్యూట్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఆమెకు పురస్కారం అందించండి..
జయశాంతి చొరవను గుర్తించిన విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్(Education Minister Nara Lokesh) ట్విట్టర్ లో ఆమెను ట్యాగ్ చేసి అభినందించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమెకు పురస్కారం అందించాలని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కు సూచించారు. ఇలాంటి ఘటనలు పోలీసుల నిబద్దతను సూచిస్తాయని, ప్రజల్లో వారి పట్ల మరింత నమ్మకం కలిగిస్తాయని స్పష్టం చేశారు.
పోలీసులపై మరింత నమ్మకం పెరిగేలా చేసింది..
కానిస్టేబుల్ జయశాంతికి హోం మంత్రి అనిత(Home Minister Anita) ఫోన్ చేసి మాట్లాడారు. ఈ రోజు పోలీసులపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందని మంత్రి అనిత అన్నారు. ఆమె కుటుంబం యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ జయశాంతి హోం మంత్రిని కలిసేందుకు ఆసక్తి చూపించగా.. త్వరలోనే కలుద్దామని మంత్రి అనిత హామీ ఇచ్చారు. విధుల్లో లేకపోయినా సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించారని.. సోషల్ మీడియా వేదికగా జయశాంతిని అభినందించిన వారందరికీ పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.