ఆసుపత్రుల్లో దొంగతనాలు.. అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.

-రిమ్స్ ఆసుపత్రిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
-రోగుల ప్రాణాలు నిలబెట్టే వెంటిలేటర్లనే ఎత్తుకెళ్లిన ఘనులు
-పక్కా స్కెచ్‌తో పట్టుకున్న పోలీసులు.. ఐదు వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు స్వాధీనం
-దొంగిలించిన వస్తువులు కొనుగోలు చేసిన హైదరాబాద్ వ్యాపారి కూడా అరెస్ట్

ఆసుపత్రిలో రోగుల ప్రాణాలు నిలబెట్టే అత్యవసర వైద్య పరికరాలను సైతం వదలకుండా చోరీ చేస్తున్న ఒక అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును ఆదిలాబాద్ పోలీసులు రట్టు చేశారు. టెక్నీషియన్ల అవతారమెత్తి ఆసుపత్రుల్లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠాను అరెస్ట్ చేసి.. వారి వద్ద నుండి లక్షల విలువైన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించిన ఈ కేసుకు సంబంధించిన సంచలన వివరాలు ఇవే…

గత నెల 30న మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు చెందిన సజ్జన్ బాసన్ మోతే, అభిజిత్ అనే ఇద్దరు వ్యక్తులు టెక్నీషియన్లుగా ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి (రిమ్స్‌)లో ప్రవేశించారు. రెండో అంతస్తులోని RICU, SAARI వార్డుల్లో రోగులకు చికిత్స అందిస్తున్న సమయంలో ప్రాణాలకు అవసరమైన నాలుగు ‘మైండ్ రే’ బ్రాండ్ వెంటిలేటర్లను చోరీ చేసి మహారాష్ట్రకు తరలించారు.

వీటిని విక్రయించేందుకు హైదరాబాద్, ప్రగతి నగర్‌కు చెందిన కొండా రెడ్డి అనే మెడికల్ ఎక్విప్మెంట్ వ్యాపారిని సంప్రదించారు.  దొంగిలించిన వస్తువులని తెలిసీ కొనుగోలు చేసేందుకు అంగీకరించిన కొండా రెడ్డి.. వాటిని తీసుకురావడానికి  చంద్రపూర్ వెళ్లాడు. పరికరాలను కొనుగోలు చేసి కారులో హైదరాబాద్ వస్తుండగా, ఆదిలాబాద్ ఆర్టీవో కార్యాలయం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పారిపోయేందుకు యత్నించిన నిందితులను.. పోలీసులు అప్రమత్తమై వలపన్ని పట్టుకున్నారు.

విచారణలో నిందితులు నిజాలు ఒప్పుకున్నారు. కేవలం ఆదిలాబాద్ రిమ్స్‌లోనే కాకుండా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి, మహారాష్ట్రలోని నాగ్భీడ్, వని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇలాంటి దొంగతనాలకే పాల్పడినట్లు అంగీకరించారు.

పోలీసులు వీరి వద్ద నుంచి ఆదిలాబాద్ రిమ్స్ కు చెందిన 4 వెంటిలేటర్లు, నిజామాబాద్ ఆసుపత్రికి చెందిన 1 వెంటిలేటర్, ఒక NST మిషన్, మహారాష్ట్ర వని ఆసుపత్రికి చెందిన ఒక ఫీటల్ మానిటర్, నాగ్భీడ్ ఆసుపత్రికి చెందిన ఒక డయాథెరపీ మిషన్‌ను రికవరీ చేశారు. వీటితో పాటు లక్ష రూపాయల నగదు, సెల్ ఫోన్లు, ఒక బైక్, ఒక కారును సీజ్ చేశారు.

రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ అత్యవసర వైద్య పరికరాలను చోరీ చేయడం అత్యంత హేయమైన చర్య అని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మండిపడ్డారు. అనుమానాస్పదంగా వైద్య పరికరాల క్రయవిక్రయాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాలు అత్యంత కీలకమని, దొంగలను భయపెట్టేవి సీసీ కెమెరాలేనని.. కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిని ఏర్పాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ భారీ దొంగతనం కేసును చాకచక్యంగా ఛేదించిన డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు నాగరాజు, చంద్రశేఖర్, ఎస్సై అఖిల్ మరియు ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

You might also like