సరైన పత్రాలతో రిజిస్ట్రేషన్
వ్యవసాయ భూములకు సంబంధించి పత్రాలను పరిశీలించి రిజిస్ట్రేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. తాండూర్ మండలం రాంపూర్ లో భూముల రీ సర్వేపై ద్వారకాపూర్ గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన సమగ్ర భూ సర్వే అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం పాలన సమయంలో భూములు అన్ని వారి ఆధీనంలో ఉండేవన్నారు. భూములు ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన తర్వాత సీలింగ్, ఇనాం, లావుని పట్టాలు, 38- ఈ, పట్టా భూములు ఇలా అనేక రకాలుగా విభజించి సర్వే నెంబర్, ఖాతా నెంబర్ తయారు చేసినట్లు చెప్పారు. ఈ సమయంలో జరిగిన భూమార్పులకు సంబంధించి న్యాయస్థానాలలో కొన్ని కేసులు కొనసాగుతున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
పట్టాదారులు, అనుభవదారుల విషయంలో సమస్యలు ఏర్పడి పరిహారం జారీలో ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి కార్యక్రమంలో భూమి రకాల వారీగా క్రమబద్ధీకరణ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో అందిన దరఖాస్తులలో అర్హులను రికార్డులను సరిచూసి, క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. భూముల నమోదు విషయంలో పొరపాట్లు తలెత్తినట్లయితే దరఖాస్తుదారులు తమ వద్ద ఉన్న దృవపత్రాలతో అప్పీలు చేసుకోవచ్చన్నారు. పట్టాదారు మరణిస్తే ఆ భూమి వారసుల పేరిట మార్చేందుకు సరైన పత్రాలు సమర్పించాలని తెలిపారు. అన్ సర్వేయిడ్ భూముల జాబితా కింద నమోదు అయిన భూములకు సంబంధించి భూ భారతిలో దరఖాస్తు చేసుకుంటే రికార్డులను సరి చూసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
భూ సమస్యలపై అందిన దరఖాస్తులను వివిధ స్థాయిల వారీగా పరిశీలించడం జరుగుతుందని, పహాని పరంగా భూ వివరాలను నిర్ధారించుకుని మ్యాపు రూపొందించడంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, రికార్డులలో వివరాల నమోదు తరువాత సవరించడం కష్టతరమని, నమోదుకు ముందే నిర్ధారించుకోవాలని తెలిపారు. హద్దుల నిర్ధారణ, క్షేత్రస్థాయి పరిశీలన, రెవెన్యూ రికార్డుల ప్రకారం పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమంలో భూ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.
అనంతరం రేపల్లెవాడలో మహేశ్వరి కాటన్ మిల్లును సందర్శించి పత్తి కొనుగోలు ప్రక్రియ పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన పత్తి కొనుగోలు చేయాలని, సకాలంలో రైతుల ఖాతాలలో సంబంధిత నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తంగళ్ళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో నిర్మిస్తున్న షెడ్యూల్డ్ తెగల సంక్షేమ వసతి గృహ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కలెక్టర్ వెంట బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మండల తహసిల్దార్ జ్యోత్స్న, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎ.డి. శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్ ఉన్నారు.