మీకు కృతజ్ఞతలు చెప్పడానికే వచ్చా..
-గిరిజనుల అభివృద్ధికి ఇందిరా సౌర గిరిజన వికాసం
-విద్యుత్ సమస్యల పరిష్కారానికి పొలం బాట, ప్రజల బాట
-పివిటిజి గిరిజనులందరికి ఇందిరమ్మ ఇల్లు
-ఆసిఫాబాద్ జిల్లా జైనూరు సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
Deputy CM Bhatti Vikramarka:మీరు చెప్పినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది… మీ సమస్యలు తీరుస్తుంది.. మీరు కోరుకున్నట్టే కృతజ్ఞతలు తెలవడానికి వచ్చానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. ఈ క్రమంలో గురువారం ఆసిఫాబాద్ జిల్లా జైనురు మండలం జాంగాంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. మీరు కోరిన విధంగానే ప్రజా ప్రభుత్వంలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం, అభివృద్ధి సంక్షేమ పథకాలకు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. పీపుల్ మార్చ్ పాదయాత్రలో ఆ రోజు నన్ను కలిసిన వారిని, వారు విజ్ఞప్తి చేసిన సమస్యలను వివరంగా రాసుకున్నా… బడ్జెట్లో ఆయా అంశాల పరిష్కారానికి నిధులు కేటాయిస్తున్నానని తెలిపారు.
2023 మార్చిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో గిరిజనులు అటవీ భూముల హక్కులు, సాగు సమస్యలను వివరించారు… ప్రజా ప్రభుత్వం వచ్చాక గిరిజనుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వారికోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇందిరా సౌర గిరిజల వికాసం అనే పథకాన్ని తీసుకువచ్చామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ పథకంలో ప్రభుత్వమే బోరు వేయించి సోలార్ పవర్ ద్వారా విద్యుత్ సదుపాయం, డ్రిప్పు, ఆర్థికంగా లాభపడేందుకు పామ్ ఆయిల్, అవకాడో వంటి మొక్కలు పూర్తిగా ఉచితంగా ప్రభుత్వమే అందిస్తుందని తెలిపారు. ఇప్పటికే ఈ పథకాన్ని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ప్రారంభించామన్నారు. భూ సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం రాగానే ధరణి చట్టాన్ని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం, చెప్పినట్టుగానే ధరణి స్థానంలో భూభారతి కొత్త చట్టాన్ని తీసుకువచ్చామన్నారు.
విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు వారానికి రెండు రోజులు పొలం బాట, ప్రజల బాట పడుతున్నారని అధికారులే మీ వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. అనారోగ్య సమస్యలు ఎదురైతే ఫోన్ చేయగానే 108 ఎలా వస్తుందో.. ఏమైనా విద్యుత్ సమస్యలు ఉంటే 1912 నెంబర్ కు కాల్ చేస్తే విద్యుత్ అధికారులే మీ వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. పివిటిజి గిరిజన అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఎంత తొందరగా కట్టుకుంటే అంత ఉపయోగమన్నారు.
పాదయాత్ర సమయంలో విద్యా వ్యవస్థ బాగాలేదని విన్నవించారని, ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులంతా ఆలోచించి పేద బిడ్డలకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ నిర్మిస్తున్నమని తెలిపారు. మన బిడ్డలు ప్రపంచంతో పోటీపడేలా ఒక్కో పాఠశాలను 25 ఎకరాల్లో 200 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒకేసారి వంద పాఠశాలల నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. ఉట్నూరు ఆసిఫాబాద్ రహదారి వెడల్పుకు విజ్ఞప్తి చేశారని, అందరి కోరిక మేరకు ఆ పనిని మంజూరు చేసి హమ్ పథకంలో రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలవబోతున్నట్లు తెలిపారు.
ఉట్నూరు, కెరిమెరి రోడ్డు వెడల్పు, అనార్పల్లి వంతెన నిర్మాణం కోసం అడిగారని… వాటిని సైతం మంజూరు చేసినట్టు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓజా తెగ తయారు చేసే హస్తకళల వస్తువులను ఉమ్మడి రాష్ట్రంలో ఐటీడీఏ ద్వారా మార్కెటింగ్ జరిగేదని.. పది సంవత్సరాలు పట్టించుకోలేదని విజ్ఞప్తి చేశారు. మీ విజ్ఞప్తి దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రభుత్వం రాగానే మీ వృత్తి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ప్రభుత్వం గుర్తించిందన్నారు… చేతి పనిముట్లకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ట్రై కార్ రాష్ట్ర చైర్మన్ బెల్లయ్య నాయక్, జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి, ఎంపీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి , జిల్లా కలెక్టర్ హరిత, జిల్లా ఎస్పి నితిక పంత్ , డీఎఫ్ఓ నీరజ్ కుమార్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఏఎస్పీ చిత్తరంజన్, ఏఎంసీ చైర్మన్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.