అన్నం పెట్టారు.. అడుగులో అడుగేశారు..
-రెండేళ్ల కిందట పాదయాత్ర స్మృతులు గుర్తు చేసుకున్న భట్టి
-లక్ష్మీబాయి, గంగుబాయిని భోజనానికి రమ్మన్న డిప్యూటీ సీఎం
-రాను, పోను ఖర్చులు తానే పెట్టుకుంటానని వెల్లడి
Deputy CM Bhatti Vikramarka:రెండేళ్ల కిందట ఒక లక్ష్యంతో పాదయాత్ర చేశాను.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగాను.. ఆ రోజు నాతో అడుగులో అడుగు వేశారు.. అన్నం పెట్టి ఆదరించారు.. ప్రజా ప్రభుత్వం వస్తుందని… మళ్లీ రావాలని దీవించి పంపారు… మీ దీవెనలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది… మీ కోసం వచ్చానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
ఆయన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం దేవుగూడ గూడెం వెళ్లారు.లక్ష్మీబాయి, గంగు భాయ్ తనకు ఆనాడు భోజనం పెట్టడమే కాదు, తనతో పాటు కొన్ని కిలోమీటర్ల మేర నడిచారన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. వారందరినీ పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నారు. తన పాదయాత్ర సందర్భంగా అప్పటి ఫోటోలు చూపిస్తూ ఆనాటి విషయాలను గుర్తు చేశారు. తాను కూర్చున్నది, వారు చెప్పిన సమస్యల గురించి ప్రస్తావించారు. పాదయాత్రలో గంగుబాయి, లక్ష్మీ భాయ్ ఇద్దరు భోజనం పెట్టారు..వారు ఆశీర్వదించినట్టుగా ప్రజా ప్రభుత్వం వచ్చింది వారిద్దరిని హైదరాబాదులో నేను ఉంటున్న ప్రజాభవన్ కు భోజనానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానని కోరారు. వారు హైదరాబాద్ కు వచ్చేందుకు, తిరిగి వెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తానని తెలిపారు.