అమ్మలను చూసేందుకు ఆకాశ మార్గం…
Medaram Jathara:మేడారం మహా జాతరను పురస్కరించుకొని భక్తులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రత్యేక బస్సులు నడుపుతున్న ప్రభుత్వం, ఇప్పుడు భక్తుల కోసం హెలికాప్టర్ సేవలను కూడా ప్రారంభించింది.
సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకునే భక్తుల కోసం హనుమకొండ నుంచి నేరుగా మేడారానికి హెలికాప్టర్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవలతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, తక్కువ సమయంలోనే మేడారానికి చేరుకునే అవకాశం లభించనుంది. మేడారం పరిసరాలను ఆకాశం నుంచి వీక్షించేలా ప్రత్యేకంగా జాయ్ రైడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ హెలికాప్టర్ సేవలు 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న మేడారం మహా జాతరకు వారం ముందే ఈ సర్వీసులను ప్రారంభించడం ద్వారా భక్తుల రద్దీని ముందుగానే నియంత్రించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అడుగులు వేసింది.
తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో తుంబి ఎయిర్ లైన్స్ ఈ సేవలను నిర్వహిస్తుండగా, మేడారంలో మంత్రి సీతక్క హెలికాప్టర్ సేవలను రెండు రోజుల కిందట అధికారికంగా ప్రారంభించారు. హనుమకొండ నుంచి మేడారానికి అప్‌డౌన్ హెలికాప్టర్ ప్రయాణానికి ఒక్కో భక్తుడికి రూ.35,999 చార్జీగా నిర్ణయించారు. హనుమకొండ నుంచి మేడారానికి చేరుకోవడానికి కేవలం 30 నిమిషాల సమయమే పడుతుంది. ఒక్కో రైడ్‌లో ఆరుగురు భక్తులు ప్రయాణించవచ్చు. మేడారం చేరుకున్న వెంటనే నేరుగా దర్శనం కల్పించి, గంటలోపే తిరిగి హనుమకొండకు తీసుకువస్తారు.
ఇక, రెండో ప్యాకేజీ కింద మేడారం జాతర అందాలను ఆకాశం నుంచి వీక్షించాలనుకునే వారి కోసం ‘జాయ్ రైడ్స్’ నిర్వహిస్తున్నారు. మేడారం సమీపంలోని పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి ఈ సర్వీసులు నడుస్తాయి. సుమారు 6 నుంచి 7 నిమిషాల పాటు సాగే ఈ గగన విహారానికి ఒక్కొక్కరికి రూ. 4,800 రుసుముగా వసూలు చేయనున్నారు. ఈ సేవలతో భక్తులు సమయం ఆదా చేసుకోవడంతో పాటు జాతరను విహంగ వీక్షణం చేసే అద్భుత అవకాశం పొందవచ్చు.