టీ హబ్‌పై రేవంత్ కీలక నిర్ణయం
T-Hub:టీ-హబ్‌ను స్టార్టప్‌ల కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మార్చుతున్నట్లు వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు. టీ-హబ్‌ను ప్రత్యేకంగా స్టార్టప్‌ల కేంద్రంగానే గుర్తించాలని చెప్పారు. ఇంక్యుబేటర్‌గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్‌గా స్టార్టప్‌లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ-హబ్‌లో ఇతర కార్యాలయాలు ఉండకూడదన్నారు. అలాంటి ఆలోచనలు ఉంటే విరమించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఆ వార్తల నేపథ్యంలోనే..
టీ-హబ్ లక్ష్యాన్ని నీరుగార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని వార్తలు వచ్చాయి. దేశంలోనే ఆధునాతన ఇంక్యుబేటర్‌గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్‌గా ఈ కేంద్రం నిలిచింది. దీంట్లోకి అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తున్నారనే ప్రచారం సాగింది. ప్రధాన పత్రికల్లో సైతం కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్‌కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. టీ-హబ్‌ను ప్రభుత్వ ఆఫీసుల కోసం వాడకూడదని ఆయన సీఎస్ రామకృష్ణా రావుకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టీ-హబ్ అనేది ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన స్టార్టప్ హబ్ అని…దాంట్లోకి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు వల్ల దాని ప్రాధాన్యత, పనితీరు దెబ్బతినే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. యువ పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ ప్రాంగణం పూర్తిగా వారి కార్యకలాపాలకే కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది.