ఎమ్మెల్యే పీఏగారికో సీటు..

ఆయ‌న ఎమ్మెల్యే గారి పీఏ… త‌న బంధువుల‌ను బ‌రిలో నిల‌పాల‌నుకున్నారు… రెండు వార్డుల్లో త‌న వారిని నిల‌బెట్టేందుకు పావులు క‌దుపుతున్నారు.. రాజు త‌ల‌చుకుంటే దెబ్బ‌ల‌కు కొద‌వా అన్న‌ట్లు… చాలా మంది ఆయ‌న‌కు మ‌ద్ద‌తు చెబుతున్నారు… అయితే, అదే స‌మ‌యంలో చాలా మంది నాయ‌కులు మాత్రం గుర్రుగా ఉన్నారు. ఇంత‌కీ ఎవరా పీఏ.. ఏంటా క‌థ‌..? నాంది న్యూస్ ప్ర‌త్యేకం…

మున్సిప‌ల్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో చాలా మంది నేత‌లు టిక్కెట్ల వేట‌లో ప‌డ్డారు. మ‌రీ ముఖ్యంగా ఆ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీల చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు. గ‌తంలో తాము పార్టీకి చేసిన సేవ‌లు, ఎమ్మెల్యేల గెలుపు కోసం చేసిన కృషి… ఎన్నిక‌ల్లో త‌మ బ‌లం, బ‌ల‌గం ఇలా అన్ని ర‌కాలుగా ఏక‌రువు పెడుతున్నారు. త‌మ వారి ద్వారా నేత‌ల‌కు చెప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దీంతో రాజ‌కీయంగా వేడి పెరుగుతోంది. టిక్కెట్టు కేటాయించేందుకు అటు నేతలు సైతం ఆచి తూచి అడుగు వేస్తున్నారు. గ‌తంలో తాము ఇచ్చిన హామీల మేర‌కు ఆయా ప్రాంతంలో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు టిక్కెట్టు ఇచ్చేందుకు బేరీజు వేసుకుంటున్నారు.

బ‌రిలో ఎమ్మెల్యే పీఏ బంధువులు..
బెల్లంప‌ల్లి మున్సిపాలిటీలో సైతం టిక్కెట్ల కోసం పోటీ పెరిగింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్టు త‌మ‌కంటే త‌మ‌కంటూ నేత‌లు క్యూ క‌డుతున్నారు. ఎమ్మెల్యే వినోద్ సైతం ఎవ‌రికి టిక్కెట్టు ఇస్తే ఎలా ఉంటుంది..? వారి బ‌లాబ‌లాలు ఇత‌ర అంశాల‌పై సైతం ఆరా తీస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే ఆయ‌న ప్రైవేటు పీఏ ప్ర‌సాద్ సైతం ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న‌ట్లు స‌మాచారం. ఇక్క‌డ ఆయ‌న నేరుగా రంగంలోకి దిగ‌కుండా, ఆయ‌న భార్య‌ను కానీ, త‌ల్లిని కానీ నిల‌బెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయ‌న 4వ వార్డు కానీ, 19వ వార్డు నుంచి కానీ పోటీ చేయించేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ‌వారికి అన్యాయం..
అయితే, పీఏ ఆయ‌న బంధువులు పోటీలోకి దిగితే గ‌తంలో పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ‌వారికి అన్యాయం జ‌రుగుతుంద‌ని సొంత పార్టీ నేత‌లే ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నిక‌ల సంద‌ర్భంగా వినోద్‌ 1, 3, 6, 9, 19 వార్డుల‌కు చెందిన కౌన్సిల‌ర్ల‌ను కాంగ్రెస్‌లోకి పిలిపించుకున్నారు. తాను గెలిస్తే కౌన్సిల‌ర్ టిక్కెట్టు మీకే అంటూ హామీ సైతం ఇచ్చారు. అయితే, ఇప్పుడు రిజ‌ర్వేష‌న్లు అన్నీ తారుమారు అయ్యాయి. ఈ నేప‌థ్యంలో గ‌తంలో ఎమ్మెల్యే హామీ ఇచ్చిన కొంద‌రు నాయ‌కులు 4వ వార్డు, 19వ వార్డు నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అయితే, ఎట్టి ప‌రిస్థితుల్లో త‌న వారిని పోటీలో దించాల‌ని, అవ‌స‌రం అయితే చైర్‌ప‌ర్స‌న్ రేసులో సైతం ఉండొచ్చ‌ని ఆయ‌న భావిస్తున్నారు.

నేత‌ల మ‌ద్దతుతో ముందుకు…
ఎమ్మెల్యే పీఏ ఇప్ప‌టికే కొంద‌రు నేత‌ల మ‌ద్ద‌తుతో టిక్కెట్టు కోసం ముందుకు సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 17వ వార్డు నుంచి ఓ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి టిక్కెట్టు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. గ‌తంలో బీఆర్ ఎస్ పార్టీలో కీల‌కంగా ఉన్న అత‌నికి టిక్కెట్టు ఇస్తే త‌న వెంట ఉండి గెలిపిస్తాడ‌ని ఆయ‌న‌కు ఎమ్మెల్యే ద్వారా టిక్కెట్టు ఇచ్చేందుకు పావులు క‌దుపుతున్న‌ట్లు స‌మాచారం. అదే స‌మ‌యంలో, మ‌రి కొంద‌రు నేత‌ల‌కు సైతం టిక్కెట్టు ఇప్పించి త‌న‌కు మార్గం అనుకూలంగా మార్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్న‌ట్లు స‌మాచారం.

గుర్రుగా సీనియ‌ర్లు నేతలు
అయితే, పీఏ వ్య‌వ‌హారంలో చాలా మంది నేత‌లు అసంతృప్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. కొంత మంది బ‌హిరంగంగా విమ‌ర్శిస్తుంటే మ‌రికొంద‌రు ప‌రోక్షంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నో వివాదాల్లో ఉన్న పీఏకు టిక్కెట్టు ఇస్తే అది కాంగ్రెస్ పార్టీకి చెడ్డ‌పేరు తీసుకువ‌స్తుంద‌ని బాహాటంగానే చెబుతున్నారు. బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే పీఏ భూ దందాలు, అక్ర‌మాలు చేస్తున్నార‌ని ఏకంగా మావోయిస్టులే లేఖ‌లు విడుద‌ల చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్బంగా నేత‌లు గుర్తు చేస్తున్నారు. ఆయన మందు తాగి రోడ్ల మీద హ‌ల్ చ‌ల్ చేశార‌ని, డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల వ్య‌వ‌హారంలో సైతం ఆయ‌న మీద ఆరోప‌ణ‌లు వ‌చ్చాయని చెబుతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు టిక్కెట్ల విష‌యంలో బెల్లంప‌ల్లి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గొడ‌వ‌లు లేకుండా సాగుతోంది. ఇప్పుడు పీఏ వ్య‌వ‌హారం కాస్తా పార్టీలో చిచ్చుపెట్టేలా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికైనా ఎమ్మెల్యే వినోద్ ఈ వ్య‌వ‌హారంపై దృష్టి సారించి, త‌న‌ను న‌మ్ముకుని పార్టీలోకి వ‌చ్చిన వారికి, ఎమ్మెల్యేగా త‌న గెలుపు కోసం కృషి చేసిన వారికి టిక్కెట్టు ఇవ్వాల‌ని కాంగ్రెస్ పార్టీ నేత‌లు కోరుకుంటున్నారు… మ‌రి ఎమ్మెల్యే ఏం చేస్తారో వేచి చూడాలి….

Get real time updates directly on you device, subscribe now.

You might also like