ఆకట్టుకున్న సీతక్క హాకా నృత్యం
మేడారం జాతరను (Medaram Jatara ) న్యూజిలాండ్ మావోరి తెగకు ( New Zealand Maori tribe ) చెందిన ప్రతినిధులు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా గద్దల ప్రాంగణంలో వారి హాకా నృత్య ప్రదర్శన ( Haca Dance ) ఆకట్టుకుంది. తెలంగాణ, న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా పంచాయతీ రాజ్, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో మావోరి తెగ ప్రతినిధులు మేడారం మహాజాతరను సందర్శించారు. హాకా నృత్య ప్రదర్శన మంత్రి సీతక్క స్వయంగా కళాకారులతో కలిసి నృత్యం చేసి వారిలో ఉత్సాహాన్ని పెంచారు. ఈ సందర్భంగా బంగారం, వన దేవతల ప్రసాదాన్ని అందజేసి మావోరి తెగ ప్రతినిధులను సన్మానించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ఆదివాసీ సంస్కృతికి దేశ సరిహద్దులు, భాషలు అడ్డుకావన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఆదివాసీలు అడవి, ప్రకృతి మీదే ఆధారపడి జీవనం సాగిస్తారని పేర్కొన్నారు.
ఏమిటీ హాకా నృత్యం
హాకా నృత్యం మావోరి తెగలో యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు, శత్రువుల్లో భయాన్ని కలిగించే విధంగా చేసే సంప్రదాయ నృత్యంగా ప్రసిద్ధి చెందింది. ఈ నృత్యంలో హావభావాలు, శరీర కదలికలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. ఈ నృత్యాన్ని కళాకారులు ప్రదర్శించారు. తెలంగాణ – న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో మావోరి తెగ ప్రతినిధులు మేడారం మహాజాతరను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్‌పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా తదితరులు పాల్గొన్నారు.