సీఎం అంటే కోల్ మాఫియా..
KTR:సీఎం అంటే (CM) అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ (Chief Minister) కాదు, సీఎం అంటే కోల్ మాఫియా (Coal Mafia) కి నాయకుడిగా రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి, సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో రాష్ట్ర గవర్నర్ ని కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడికి దోచిపెట్టింది సరిపోలేదని.. ఇప్పుడు బావుమరిది కళ్లల్లో ఆనందం చూసేందుకు సింగరేణి బొగ్గు కాంట్రాక్టులను కట్టబెడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.
నిజంగానే 2018 నుంచి 2024 వరకు ఈ నిబంధనను కేంద్రప్రభుత్వం సిఫారసు చేసి ఉంటే.. ఆ రోజున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం తరపున అన్ని టెండర్లను కూడా మేం పారదర్శకంగా పిలిచినం. అందుకే ఆ రోజు అన్నీ మైనస్ టెండర్లు వచ్చినయ్. ఎస్టిమేటివ్ కంటే తక్కువ ఖర్చుకే సింగరేణికి డబ్బులు ఆదా చేస్తూ ఆ రోజు జరిగిన మాట వాస్తవమా.. కాదా..? అని ప్రశ్నించారు. మరి ఆ రోజు టెండర్లలో లేని షరతు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికేషన్ విధానం ఎందుకు పెట్టారు…? ఎవరికి లాభం చేయడానికి పెట్టారు. అంటే ఇంతవరకు ప్రభుత్వంలోని బాధ్యులు ఏ ఒక్కరూ కూడా సమాధానం చెప్పడం లేదన్నారు కేటీఆర్ .
ఒక్క నైనీ బొగ్గు గని టెండర్లే కాదు.. నైనీలో కూడా 2021, 2022లో రెండుసర్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టెండర్లు పిలిచాం. కానీ ఆ రోజు ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే నిబంధన లేదు. మరి ఈ రోజు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అవసరం లేనిది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిబంధన ఎందుకు అవసరమొచ్చింది. అని మేం అడిగితే ఇంతవరకు సమాధానం లేదన్నారు. సింగరేణి సంస్థ ఎన్ని సర్టిఫికెట్లు జారీ చేసిందని మీరొక శ్వేత పత్రం విడుదల చేయండి అని మేం డిమాండ్ చేస్తే ఇంతవరకు సమాధానం లేదన్నారు కేటీఆర్. మీరు కొంతమందికే సెలెక్టివ్‌గా ఎందుకిచ్చారని ప్రశ్నించారు. కొంతమంది కాంట్రాక్టు సంస్థలనే మీరు ఎందుకు ఎంచుకుంటున్నారు,,,? మిగతావాళ్లనెందుకు పక్కనపెడుతున్నారు….? ఇందులో రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి బావమరిది అవునా…? కాదా…? అని మేం అడిగితే ఇంతవరకు సమాధానం లేదని కేటీఆర్ దుయ్యబట్టారు.