వనమెల్ల… జనమై…
Medaram Jatara 2026: మేడారం మహా జనసంద్రమైంది. అమ్మ కరుణ కోసం భక్తిశ్రద్ధలతో తరలివచ్చిన బిడ్డలతో మహారణ్యం జనారణ్యమైంది. పగిడిద్దరాజు, గోవిందరాజు మేడారం చేరుకున్నాక సారలమ్మ గద్దెపై కొలువుతీరింది..ఈ రోజు సమ్మక్క రానుంది
మేడారం సమ్మక్క – సారలమ్మ మహా జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఆదివాసీ సంప్రదాయాల మధ్య సారలమ్మను గిరిజన పూజారులు బుధవారం రాత్రి గద్దెలపైకి చేర్చారు. అలాగే పగిడిద్ద రాజు, గోవింద రాజులు కూడా గద్దెలపైకి చేరుకుని చేరుకున్నారు. గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజుల ఆగమనంతో మేడారం జాతరలో తొలి ఘట్టం పూర్తైంది. జాతరలో ప్రధాన ఘట్టం గురువారం ఆవిష్కృతం కానుంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెలపైకి చేరుకోనున్నారు. మేడారం మహాజాతర ప్రారంభానికి కంటే ముందు నుంచే పెద్ద ఎత్తున భక్తులు అమ్మవార్ల గద్దెలను దర్శించుకుని, మెక్కులు చెల్లించుకుంటున్నారు.
బుధవారం కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో గిరిజన పూజారులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్యతో పాటు ఇతర వడ్డెలు రహస్య పూజలు చేశారు. రాత్రి 7.45 గంటల ప్రాంతంలో కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారంకు బయలుదేరింది. ఈ దృశ్యాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు కన్నెపల్లికి చేరుకున్నారు. సారలమ్మను బయటకు తీసుకొచ్చే సమయంలో శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. ఆదివాసీలు నృత్యాలు చేస్తూ, కొమ్ము బూర ఊదారు. వెదురుబుట్టలో సారలమ్మను తీసుకొని పూజారులు మేడారం బయలుదేరగా… దారిపొడువున భక్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. సంతానం లేనివారు పిల్లల కోసం వరాలు పట్టారు. దారికి అడ్డంగా పడుకున్న మహిళలపై పసుపు కుంకుమలు, అక్షింతలు చల్లుతూ పూజారులు ముందుకు సాగారు. భారీ భద్రత మధ్య జంపన్న వాగు దాటుకుని సారలమ్మ తల్లి మేడారం గద్దెల సమీపానికి చేరుకున్నారు. సారలమ్మ తల్లి జంపన్నవాగు దాటుతుండగా భక్తులు జయజయధ్వానాలు చేశారు.
సారలమ్మ బుధవారం అర్ధరాత్రి 12.12 గంటలకు గద్దెను అలంకరించింది. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి వద్ద సారలమ్మకు స్వాగతం పలికారు. సారలమ్మను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే కన్నెపల్లికి భక్తజనం పోటెత్తింది. పూజల తరువాత కన్నెపల్లి నుంచి 16 మంది ఆడబిడ్డలు సంప్రదాయం ప్రకారం డోలి విన్యాసాలతో తరలివచ్చి గద్దెలపై ముగ్గులు పెట్టి కంకవనానికి కంకణాలు కట్టారు. మధ్యాహ్నం 3 గంటల నుంచే కన్నెపల్లి సారలమ్మ గుడి వద్ద డోలి విన్యాసాలు, తుడుందెబ్బ, ఆదివాసీ విద్యార్థి పరిషత్, సారలమ్మ యువజన సంఘం బృందాల సారథ్యంలో కళా ప్రదర్శనలు కొనసాగాయి.
మహాజారతలో ఈ రోజు సమ్మక్క తల్లి సాయంత్రం గద్దెపైకి వస్తుంది. మొదటగా గిరిజన పూజారులు మేడారం సమీపంలోని చిలుకల గుట్టకు వెళ్ళి వెదురు కర్రలు తీసుకొచ్చి గద్దెలపై పెట్టి పూజిస్తారు. ఆ తర్వాత సమ్మక్క పూజా మందిరం నుంచి పసిడి కుండలను తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. తర్వాత మళ్ళీ చిలుకల గుట్టకు వెళ్తారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సమ్మక్కను గద్దెపైకి తీసుకువచ్చే మహాఘట్టం మొదలవుతుంది. తల్లి రూపాన్ని చేతపట్టుకున్న మరుక్షణమే ప్రధాన వడ్డె తన్మయత్వంతో పరుగు పరుగున గుట్ట దిగుతాడు. కలెక్టర్, ఎస్పీ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి వనదేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్క రాకతో మేడారం మొత్తం శివసత్తుల పూనకాలతో హోరెత్తి ఊగిపోతుంది. దారి పొడవునా భక్తుల జన ప్రవాహం సాగుతుంది..అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా జంతు బలులు ప్రారంభమవుతాయి. కుంకుమ భరణిని గద్దెలపైకి చేర్చిన తర్వాత మహా జాతర లాంఛనంగా ప్రారంభమవుతుంది.