జాతరలో బైక్‌పైన మంత్రులు…
Medaram 2026:అన్ని ఏర్పాట్లతో మేడారం మహా జాతర సజావుగా సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా చూసేందుకు ప్రభుత్వం సమ్మక్క–సారలమ్మ జాతరను నిరంతరం పర్యవేక్షిస్తోందని ఆయన స్పష్టం చేశారు. జాతరలో మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ములుగు కలెక్టర్ టి.ఎస్. దివాకర గురువారం ఉదయం బైక్‌పై పర్యటించి జాతర ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. జంపన్న వాగు వద్ద స్నానపు గదులు, పరిసర ప్రాంతాలలో పారిశుధ్య చర్యలు, ఇతర ఏర్పాట్లను బైక్‌లపైనే తిరుగుతూ పర్యవేక్షించారు.
సకాలంలో వైద్య సాయం, పారిశుధ్యం, నిరంతర వ్యర్థాల తొలగింపు, తప్పిపోయిన వ్యక్తుల సహాయ శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గద్దెల సమీపంలో పరిశుభ్రత, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రజలు సజావుగా దర్శనాలు చేసుకునేందుకు సురక్షితంగా గమ్యస్థానాలు చేరేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని మంత్రి అన్నారు.