కాణిపాకంలో అంతరాలయ దర్శనం ప్రారంభం
-అంతరాలయ దర్శనాలు ప్రారంభం
-రూ.500 టికెట్‌తో అంతరాలయ దర్శనం
-ఆన్లైన్లో దర్శనం, వసతి, సేవలు, ప్రసాదం టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం
Kanipakam Temple: శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో అంతరాలయ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు అంతరాలయ దర్శనాన్ని అధికారులు లాంఛనంగా ప్రారంభించారు. రూ.500 టికెట్‌తో భక్తులు ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారిని దర్శించుకోవచ్చు. అంతరాలయం దర్శనం చేసుకున్న వారికి ఉచిత అభిషేకం, లడ్డూ అందజేస్తారు. మొదటి టికెట్ ఆలయ ఈవో కొనుగోలు చేసి వినాయక స్వామిని దర్శించుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు.. అలాగే సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు అంతరాలయ దర్శనానికి అవకాశం ఉంది.
అందుబాటులోకి ఆన్లైన్ సేవలు..
మరోవైపు కాణిపాకం ఆలయానికి సంబంధించి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భక్తులు దర్శనం, వసతి, సేవ, ఆర్జిత సేవ, ప్రసాదం టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. వెబ్సైట్, వాట్సాప్ ద్వారా ఈజీగా సేవలు పొందొచ్చు. ఈ మేరకు భక్తులు https://www.srikanipakadevasthanam.com వెబ్సైట్, https://www.aptemples.ap.gov.in ద్వారా కూడా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. మనమిత్ర వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా కూడా కాణిపాకం ఆలయానికి సంబంధించిన సేవలు పొందవచ్చు.
సంకటహర చతుర్థి వ్రతం మార్పులు.
కాణిపాకం ఆలయంలో సంకటహర చతుర్థి వ్రతానికి సంబంధించి కీలక మార్పులు చేశారు. ఇప్పటివరకు ఒక్క వ్యక్తికి మాత్రమే రూ.350 టికెట్‌తో నిర్వహిస్తున్న ఈ వ్రతాన్ని ఇకపై రూ.500 టికెట్‌తో నిర్వహించనున్నారు. అయితే ఈ టికెట్‌కు దంపతులు కూర్చునే అవకాశం కల్పించడంతో భక్తులకు ఇది మరింత అనుకూలంగా మారనుంది. అంతేకాకుండా ఈ టికెట్ తీసుకున్న భక్తులకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, అలాగే సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు నూతన అంతరాలయం దర్శనం కల్పించనున్నారు.
ఇప్పటివరకు ఉదయం, సాయంత్రం రెండు సార్లు మాత్రమే నిర్వహిస్తున్న సంకటహర చతుర్థి వ్రతాన్ని ఇకపై అదే రోజున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు బ్యాచులుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పాలకమండలి నిర్ణయించింది. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.