వీడని ఉత్కంఠ
Municipal elections in Telangana:నేడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో రాజకీయ వాతావరణం ఉత్కంఠ భరితంగా మారింది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే గడువు ఉండటంతో ఆయా మున్సిపాలిటీల్లో సందడి నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా చోట్ల ఆయా పార్టీలు అభ్యర్థులకు బీఫారాలు అందించలేదు. నామినేషన్ల ఉపసంహరణ, ఎన్నికల అధికారులకు బిఫారాల అందజేసేందుకు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకే చివరి గడువు. దీంతో అన్ని పార్టీలు తమ పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులను ఖరారు చేయాల్సిందే. బిఫారాలు ఇవ్వాల్సిందే. ఈ నేపథ్యంలో బిఫారం దక్కని వారు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వారంతా స్వతంత్రులుగా పోటీలో ఉంటే పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు పలుచోట్ల ఇబ్బందులు తప్పేలా లేవు.
దీంతో అటు ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జీలు అభ్యర్థులను బుజ్జగించే పనిలో పడ్డారు. రెబల్ అభ్యర్థులను తప్పించేందుకు వారికి అన్ని రకాలుగా హమీలు గుప్పిస్తున్నారు. బెల్లంపల్లిలో క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ అభ్యర్థులతో మంతనాలు జరుపుతున్నారు. నిన్నటి నుంచి అక్కడ పెద్ద ఎత్తున అభ్యర్థులు, ఆశావహులు ఎదురుచూస్తున్నారు. నిన్ననే బిఫారంలు ఇస్తారనే ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున వచ్చారు. ఈరోజు కూడా ఇంకా చర్చలు సాగుతూనే ఉన్నాయి.
ఇక దాదాపు అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. చివరి నిమిషంలో అర్హులైన వారికి బీఫారాలు అందించి మిగతా వారిని విత్ డ్రా చేసుకునేలా పావులు కదుపుతున్నారు.