బాంబుల బ్యాచ్‌ను గెలిపిస్తే.. మీ భూములు గుంజుకుంట‌రు..

Balka Suman:బాంబుల బ్యాచ్‌ను గెలిపిస్తే మీ భూముల‌ను సైతం గుంజుకుంటార‌ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ హెచ్చ‌రించారు. చెన్నూరు మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ చెన్నూరుల బాంబుల బ్యాచ్ అంతా ఒక్క దిక్కందైంటూ ఆయ‌న ఎద్దేవా చేశారు. శ‌న‌గ‌కుంట మత్త‌డి బాంబుల‌తో పేల్చేసిన వాళ్ల‌కు అవ‌కాశం ఇస్తే.. మీ భూములు గుంజుకుంటార‌ని, మీ ఇండ్లు సైతం పేల్చేస్తారంటూ దుయ్య‌బ‌ట్టారు. వాళ్ల‌తో క‌నీసం మాట్లాడే అవ‌కాశం కూడా ఉండ‌ద‌న్నారు.

మంత్రి చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో కేవలం చెన్నూరు, క్యాతన్‌పల్లి పట్టణాల్లో హడావుడిగా మంత్రి కొబ్బరికాయలు కొడుతున్నాడని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని కేవ‌లం మున్సిపాలిటీల్లో మాత్ర‌మే అభివృద్ధి పేరిట ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. మ‌రి గ్రామాల్లో ఎందుకు ప‌నులు చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను మోసం చేసింద‌న్నారు. యూరియా కోసం చెన్నూరులో రైతులు అరిగొస ప‌డ్డార‌ని, అప్పుడు మార్నింగ్ వాక్ మంత్రికి రైతుల ఇబ్బందులు క‌నిపించ‌లేదా..? అని ఎద్దేవా చేశారు.

ఈ రెండేళ్ల పాటు ప‌నులు చేయ‌ని వారు ఇక ముందు ఏం చేస్తార‌ని బాల్క సుమ‌న్ ప్ర‌శ్నించారు. మీ కోసం ప‌నిచేసేవారికి అవ‌కాశం ఇవ్వాలంటూ ప్ర‌జ‌ల‌ను కోరారు. ప్ర‌చారంలో ఆయ‌న వెంట మాజీ జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ మూల రాజిరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like