కఠిన చర్యలు తప్పవు
బెల్లంపల్లి పట్టణంలోని సమీకృత బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన బాలికలను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పరామర్శించారు. బాలికల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాలికలకు అత్యుత్తమ వైద్యం అందించాలని, ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితి వివరించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులను అప్రమత్తం చేయాలని సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే సమీకృత బాలికల వసతి గృహాన్ని సందర్శించి, వంటశాల, భోజన తయారీ విధానం, ఆహార నాణ్యత, పరిశుభ్రత తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ ఘటనకు కారణమైన అంశాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. “బాలికల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని… వసతి గృహాల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. బాధిత బాలికలకు ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.