రెండో విడ‌త ఇందిర‌మ్మ ఇండ్ల పంపిణీ..

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న

తెలంగాణలో రెండో విడ‌త ఇందిర‌మ్మ ఇండ్లు పంపిణీ చేయ‌నున్న‌ట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. “ప్రజా పాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే మొదటి విడతలో చాలా మందికి ఇళ్లు అందాయని, ఇప్పుడు మిగిలిన అర్హులందరికీ న్యాయం చేసేలా రెండో విడత అమలు చేస్తామని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల‌ కోసం రూ.22,500 కోట్లు ఖ‌ర్చు అవుతుందని రేవంత్‌ వివరించారు. ఈ పథకం ద్వారా పేదలకు సొంత ఇల్లు అనే కల నెరవేరుతుందని సీఎం అన్నారు. ప్రభుత్వం మాటిచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లు రాజకీయాలకు అతీతంగా, పూర్తిగా అర్హత ఆధారంగా ఇస్తామని తెలిపారు. రూ.100కోట్లతో మేడారం అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. ఇటీవల ముగిసిన జాతరలో సమ్మక్క-సారలమ్మను 2 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారని సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు. కేసీఆర్ వచ్చిన తర్వాత పిట్టకథలతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు రాలేదు కానీ.. ఎర్రవల్లిలో కేసీఆర్‌కు ఫామ్‌హౌస్‌ మాత్రం వచ్చిందంటూ ఎద్దేవా చేశారు.

ఎవరికీ అన్యాయం జరగకుండా అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించామని చెప్పారు. అలాగే గోదావరి సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేసే ఆలోచన ప్రభుత్వం వద్ద లేదని సీఎం స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులకు నష్టం చేకూర్చే ఏ నిర్ణయాన్నీ ప్రభుత్వం తీసుకోదని భరోసా ఇచ్చారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న గోదావరి తీరం, దేవాలయాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టుల కోసం అవసరమైతే రూ. 3 వేల కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్రానికి ఆదాయం కూడా వస్తుందని వివరించారు.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like