అధికారులు, పోలీసుల వైఖరికి నిరసనగా.. నల్ల కండువాలతో నిరసన
Balka Suman:చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి అధికార దుర్వినియోగం చేస్తుండగా, పోలీసులు, అధికారులు కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దుయ్యబట్టారు. ఆయన చెన్నూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల కండువాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. కాంగ్రెస్ రెండేళ్లు ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలని, కానీ మంత్రి బైక్‌లపై తిరుగుతూ డబ్బులు పంచుతున్నారని దుయ్యబట్టారు. పోలీసులు బీఆర్ఎస్ అభ్యర్థులను బయటకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల కమిషన్, అధికార వ్యవస్థ మొద్దు నిద్ర నటిస్తోందన్నారు. ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని దుయ్యబట్టారు. జైపూర్ ఏసీపీ, చెన్నూరు సీఐ, పోలీసులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను చెదరగొడుతున్నారని అన్నారు. ఏదో రకంగా గెలవాలనే కుట్రలు చేస్తున్నారని అన్నారు. పోలీసుల దాష్టీకానికి, మంత్రి అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా తాము నిరసనకు దిగినట్లు తెలిపారు.