హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భ‌గ్నం

Major terror plot foiled in Hyderabad:హైదరాబాద్‌లో మరో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు చంచల్‌గూడ పరిసరాల్లోని మూసారాంబాగ్, సైదాబాద్, మలక్‌పేట్ ప్రాంతాలపై గట్టి నిఘాపెట్టారు.

ఉగ్రవాద దాడులకు కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలతో మరోసారి హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ నగరంలో భారీ విధ్వంసానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. చంచల్‌గూడ జైలు ములాఖత్ నుంచి ఈ ఉగ్ర కుట్రకు ప్రణాళికలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. వరుసగా పేలుళ్లు జరిపేందుకు కుట్ర చేస్తారన్న ఆరోపణల కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు పటిష్ఠ నిఘా పెట్టారు. మరీ ముఖ్యంగా మూసారాంబాగ్, మలక్‌పేట్, సైదాబాద్ ప్రాంతాలు ప్రస్తుతం పోలీసుల కంట్రోల్‌లో ఉన్నాయి. ఈ ఉగ్రవాదితో ములాఖత్‌ అయ్యేందుకు వచ్చిన తన భార్యతో ఆ టెర్రరిస్ట్ ఉగ్రదాడుల గురించి సంభాషణలు చేసినట్లు సమాచారం. తన భార్య ద్వారా జైలు నుంచి బయటికి ఉగ్ర సమాచారాన్ని చేరవేసినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. ఎర్రకోట, చాందినీ చౌక్ వద్ద ఆలయాల్లో పేలుళ్లు జరిపేందుకు కుట్రలు చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. భారీ ఎత్తున ఐఈడీ పేలుళ్లకు ప్రయత్నాలు ఉగ్రవాదులు చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులను నిఘా వర్గాలు హెచ్చరించాయి. కాగా, గతేడాది నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడులో 15మంది మరణించగా.. 20మంది గాయపడిన విషయం తెలిసిందే.. ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.. ఈ క్రమంలోనే.. మళ్లీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పేర్కొంటుండటం కలకలం రేపింది.

 

You might also like