మరో యుద్ధం ప్రారంభం…
Israel-Iran War:మరో యుద్ధం ప్రారంభమైంది. ఇరాన్‌పై ఇజ్రాయిల్ శనివారం క్షిపణి దాడులకు దిగింది. దీంతో, భారీ పేలుళ్లతో రాజధాని టెహ్రాన్‌లోని పలు ప్రాంతాలు దద్దరిల్లాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కార్యాలయాల సమీపంలోనూ దాడులు జరగడంతో కలకలం రేగింది. అయితే, దాడుల సమయంలో సుప్రీం లీడర్ టెహ్రాన్‌లో లేరు. దాడులపై ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి కట్జ్ స్పందించారు. ముప్పును ముందస్తుగా నివారించేందుకే దాడులకు దిగామని అన్నారు.
అమెరికా కూడా ఇజ్రాయిల్ కు మద్దతుగా రంగంలోకి దిగింది. ఈ రోజు (శనివారం) ఉదయం ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. మరోవైపు ఇరాన్ ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. ఇజ్రాయిల్ పాటు అమెరికా మిత్రదేశాలపై దాడులకు తెగబడింది. మధ్యప్రాచ్యంలోని అమెరికా మిత్రదేశాలు, ఆ దేశాల్లో ఉన్న యూఎస్ స్థావరాలపై దాడులు చేసింది. బహ్రెయిన్, యూఏఈ, కువైట్, ఖతార్, జోర్డాన్ లోని అమెరికన్ స్థావరాలపై దాడులు చేసింది. మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై మిస్సైళ్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. అబుదాబి సమీపంలోని అల్-ఫ్రా (Al-Dhafra) అమెరికా వైమానిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది.
మరోవైపు ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరులకు అక్కడి ఇండియన్ ఎంబసీ కీలక సూచనలు చేసింది. ఇజ్రాయెల్ అధికారుల సూచనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించింది. క్షిపణి దాడుల నుంచి రక్షణ కల్పించే షెల్టర్‌లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని సూచించింది. అత్యవసర సందర్భాల్లో ఆయా కేంద్రాల్లో తలదాచుకోవచ్చని తెలిపింది. అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని తెలిపింది. అత్యవసర సందర్భాల్లో +972-54-7520711 నెంబర్‌పై సంప్రదించాలని లేదా cons1.telaviv@mea.gov.in కు ఈమెయిల్ చేయాలని సూచించింది.