దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి
Minister Tummala Nageswara Rao stuck in Dubai:అమెరికా, ఇజ్రాయెల్ దాడులు… ఇరాన్ ప్రతి దాడులతో పలు దేశాలు వణికిపోతున్నాయి. తనపై దాడికి ఇరాన్ అమెరికా మిత్రదేశాలపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇలా పలు దేశాలపై మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. దీంతో అయా దేశాలు తమ గగనతలాలను మూసివేయడంతో పాటు విమాన సర్వీసులను నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే దుబాయ్‌లో మన వాళ్లు చాలా మంది చిక్కుకుపోయారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) కూడా ఉన్నారు. ఐదు రోజుల కిందట ఆయన దుబాయ్ వెళ్లారు. అయితే, యుద్ధం కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరికి అనారోగ్యం నేపథ్యంలో చికిత్స ఆయన కూడా దుబాయ్ కు వెళ్లారు. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో యుద్ధ తీవ్రత నేపథ్యంలో ఆయన అక్కడే ఉండిపోయారు.
అయితే, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వారి కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. దుబాయ్ గగనతలం తిరిగి తెరుచుకొని, విమానాశ్రయ అధికారులు క్లియరెన్స్ ఇచ్చేంత వరకు వారు భారత్ వచ్చే అవకాశం లేదు. మరోవైపు భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు సైతం దుబాయ్‌లో చిక్కుకుపోయారు. విమానాశ్రయానికి సమీపంలో పేలుడు సంభవించినప్పుడు తాను అక్కడే ఉన్నానని ఆమె వెల్లడించారు. ఈ సంక్షోభ సమయంలో దుబాయ్ విమానాశ్రయం స్టాఫ్, దుబాయ్ అధికారులు, భారత హైకమిషన్ నుంచి తమకు తక్షణ సహాయం అందిందని పీవీ సింధు తెలిపారు. వారి కృషి వల్ల తమ టీమ్ సురక్షితమైన ప్రదేశానికి తరలి వెళ్లినట్లు తెలిపారు. తమకు నిరంతర సహాయం అందించి సురక్షితంగా ఉంచినందుకు దుబాయ్‌లోని భారత హైకమిషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.