మూడు వారాల్లో ఎన్నికలు నిర్వహించండి
క్యాతన్‌పల్లి ఎన్నికలపై హైకోర్టు తీర్పు
Kyatanapalli municipal elections:క్యాతనప్పల్లి మున్సిపల్ ఎన్నికలు మూడు వారాల్లో నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికలు జరిగి నెలరోజులు కావస్తున్నా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీకి ఎన్నికల జరగలేదు. ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో 22 సీట్లున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సీపిఐతో కలిసి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కూటమి 14 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మాత్రం కేవలం 7 సీట్లకే పరిమితం అయింది. అటు మ్యాజిక్ ఫిగర్‌ను దాటి కారు దూసుకుపోవడంతో క్యాతన్‌పల్లి చైర్మన్ ఎన్నిక లాంఛనమే అయింది. అయితే, చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా రెండు పార్టీల మధ్య గొడవ చోటు చేసుకుంది. మున్సిపల్ కౌన్సిల్ హాల్‌కు బయలుదేరిన సీపిఐ, బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పరిస్థితులు చేయి దాటి పోవడంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది.
ఇక, రెండవ రోజు కూడా అదే పరిస్థితి. రెండవ రోజు సైతం బీఆర్ఎస్ శ్రేణులను కాంగ్రెస్ అడ్డుకున్నాయి. అటు పోలీసుల ఆంక్షలతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేవలం తమకే ఆంక్షలు ఏమిటని..? ఎన్నికల నిబంధనలు కాంగ్రెస్ నేతలు ఉల్లంఘించినా పట్టించుకోకపోవడం ఏమిటని వాళ్లు నిలదీశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఎంట్రీతో పరిస్థితి మరింత గంభీరంగా మారింది. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే కోవలక్ష్మిని మున్సిపాలిటీ వైపు అనుమతించకపోవడంతో గొడవ ముదిరింది. ఈ నేపథ్యంలో రాళ్లదాడి, పోలీసుల లాఠీచార్జీ ఇలా కొనసాగుతూ వచ్చింది.
చివరకు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులపై కేసులు బనాయించి జైలుకు తరలించారు. ఇప్పటి వరకు పాలక వర్గం ఎన్నిక నిర్వహించకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు కోర్టును ఆశ్రయించారు. దీంతో మూడు వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.