వడ్లు కొనకుంటే తిరుగుబాటు ఖాయం
సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
వారం రోజుల్లో వడ్లు కొనకుంటే రైతులు తిరగబడతారని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దహేగాం మండలం లగ్గం గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన కల్లాల్లో ధాన్యం రోజురోజుకూ ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. వారం రోజుల్లో రైతుల వడ్లు కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున తిరుగుబాటు తప్పదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యతలేని, చినిగిపోయిన గోనె సంచులు పంపిణీ చేస్తున్నారని, మంచి గన్నీ బ్యాగులను రైస్ మిల్లులకు విక్రయించి రైతులకు పనికిరాని సంచులు ఇస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇందులో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు..
ఎమ్మెల్యే హరీష్ బాబు ఇక్కడి రైతులను వదిలి.. వేరే నియోజకవర్గ కేంద్రాల్లో పర్యటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిర్పూర్ నియోజకవర్గంలో వడ్ల కొనుగోళ్లు సరిగ్గా సాగడం లేదని రైతులు ఆవేదన చెందుతుంటే, ఆయన మాత్రం ఇతర జిల్లాల కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ అక్కడి లోపాలను ఎత్తిచూపుతున్నారని, సొంత నియోజకవర్గ రైతులను పట్టించుకోవడం లేదన్నారు. ఇక రైతుల వడ్లు కొనడానికి నిధులు లేవని కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దండే విఠల్ సర్పంచులు, ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేయడానికి మాత్రం ఆఫర్లు ఇస్తూ రాజకీయాలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని అన్నారు.
ధాన్యం కొనుగోళ్ల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఐకేపీ కేంద్రాల నిర్వాహకులు రైతులకు చినిగిన, పాత గోనె సంచులుపంపిణీ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామని కొనుగోలు కేంద్రాలకు వస్తే, అక్కడ కనీస సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని కోనప్ప దుయ్యబట్టారు.