రెండు లారీల ఢీ… డ్రైవర్ సజీవ దహనం
జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఒకరు సజీవ దహనమయ్యారు. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించింది. నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి గ్రామ సమీపంలో NH 44 రహదారిపై జరిగిన ఈ ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి…
ఆదిలాబాద్ జిల్లా సోనాల గ్రామం నుండి జొన్న లోడుతో (TG 01T1773 ) నంబర్ గల లారీ హైదరాబాద్ వైపు వెళ్తోంది. అదే రహదారిపై మహారాష్ట్ర నుండి ఆలుగడ్డ పంట లోడుతో ఆంధ్ర ప్రదేశ్ పల్నాడు జిల్లాకు (AP07 TH 7156) వెళ్తున్న లారీని డ్రైవర్ ఆపాడు. దీంతో జొన్న లోడుతో ఉన్న లారీ డ్రైవర్ జవర్ సింగ్ క్యాబిన్లో ఇరుకున్నాడు. ఈ ప్రమాదంతో విద్యుత్ స్పార్క్ అయి మంటలు చెలరేగడంతో సజీవ దహనమయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని లారీలను అందులో ఉన్న సరుకులను బయటకు తీశారు.