సీఎం ప్రజావాణితో పసిబిడ్డకు ప్రాణదానం
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘సీఎం ప్రజావాణి’లో అధికారులు సకాలంలో స్పందించడంతో తీవ్ర గుండె సమస్యతో బాధపడుతున్న ఓ నవజాత శిశువు ప్రాణాలను కాపాడింది. ఎల్బీనగర్‌కు చెందిన దినసరి కూలీ కె. ఆంజనేయులు కుమార్తె గ్రేసీ పుట్టుకతోనే ‘ట్రాన్స్‌పోజిషన్ ఆఫ్ ది గ్రేట్ ఆర్టరీస్ (TGA)’ అనే అరుదైన గుండె లోపంతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. చిన్నారి చికిత్స కోసం ఆంజనేయులు ఎన్నో ఆసుపత్రులు తిరిగారు. అయితే, శస్త్రచికిత్సకు భారీ ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడంతో సాయం కోసం ‘సీఎం ప్రజావాణి’ కార్యక్రమాన్ని ఆశ్రయించారు.
వెంటనే స్పందించిన ప్రజావాణి బృందం చిన్నారిని హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌లో చేర్పించి, అవసరమైన వైద్య సేవలు అందేలా చూసింది. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, శస్త్రచికిత్సకు అవసరమైన రూ.8 లక్షల వ్యయాన్ని ప్రభుత్వమే భరించేలా చర్యలు చేపట్టింది. దీంతో చిన్నారి గ్రేసీకి అత్యవసరమైన గుండె శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా కోలుకుంటున్నట్లు సమాచారం. సంక్షోభ సమయంలో అవసరంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, ప్రజలకు భరోసా కల్పించడంలో సీఎం ప్రజావాణి కార్యక్రమం మరోసారి తన ప్రాధాన్యతను చాటుకుందని అధికారులు పేర్కొన్నారు.