సోయా విత్తనాల మోసం… రైతుకు భారీ నష్టం..
“వాన పడింది… రైతు విత్తనం చల్లాడు… ఈసారి పంట బాగా పండుతుందనుకున్నాడు. కానీ మొలక రావాల్సిన పొలంలో నిశ్శబ్దం అలుముకుంది. ఒక్క గ్రామం కాదు… పలుగ్రామాల్లో అదే పరిస్థితి. లాట్ నంబర్లు లేని సంచులు… స్కాన్ చేసినా కనిపించని వివరాలు… వందల ఎకరాల్లో మొలకెత్తని సోయా. అన్నదాతల కన్నీటి వెనుక అసలు కారణమేంటి? నాంది న్యూస్ ప్రత్యేక కథనం…
ఆదిలాబాద్ జిల్లాలో తేజస్వి రకం సోయా విత్తనాలు విత్తిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్ష్మీపూర్తో పాటు జైనథ్ మండలంలోని కరంజి, నిరాల, సాంగి తదితర గ్రామాల్లో విత్తిన సోయా విత్తనాలు మొలకెత్తకపోవడంతో వందల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల చెప్పిన వివరాల ప్రకారం, తేజస్వి రకం విత్తనాల వివిధ లాట్ నంబర్లకు చెందిన సంచుల్లో మొలక సమస్య కనిపించింది. కొన్ని సంచులపై లాట్ నంబర్లు లేకపోవడంతో పాటు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసినా ఎలాంటి వివరాలు కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమకు నాసిరకం విత్తనాలు సరఫరా అయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు.
జిల్లాలో కేవలం ముగ్గురు డీలర్లు వేలాది సంచుల తేజస్వి సోయా విత్తనాలు విక్రయించినట్లు సమాచారం. ప్రాథమిక అంచనాల ప్రకారం లక్ష్మీపూర్ గ్రామంలో సుమారు 450 ఎకరాలు, కరంజిలో 50 ఎకరాలు, నిరాల, సాంగి గ్రామాల్లో వంద ఎకరాలకు పైగా సోయా పంట మొలకెత్తలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పందించి అధికారులు క్షేత్రస్థాయికి పంపించారు. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు లక్ష్మీపూర్తో పాటు జైనథ్ శివారు ప్రాంతాల్లోని సోయా పొలాలను పరిశీలించారు. బాధిత రైతులు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తుండగా, సోనమ్ కంపెనీ తయారు చేసిన తేజస్వి రకం విత్తనాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు.
తమకు జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఎకరాకు రూ.15 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో జిల్లాలోని ఇతర రైతుల్లోనూ ఆందోళన నెలకొంది. సమగ్ర విచారణ అనంతరం అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.