జాతీయ వేదికపై సింగరేణి విజయకేతనం..

5 గనులకు 5-స్టార్ రేటింగ్

Singareni:సింగరేణి కాలరీస్ సంస్థ మరోసారి జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించే అత్యుత్తమ గనుల ఎంపికలో సింగరేణికి చెందిన ఐదు గనులు ప్రతిష్ఠాత్మక 5-స్టార్ రేటింగ్ సాధించాయి. దేశవ్యాప్తంగా 382 గనులు పోటీపడగా, కేవలం 50 గనులు మాత్రమే 5-స్టార్ రేటింగ్‌కు ఎంపికయ్యాయి. వాటిలో ఐదు గనులు సింగరేణివే కావడం విశేషం. ఈసారి శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన ఆర్.కె న్యూటెక్, ఆర్.కె-6, సత్తుపల్లి ఏరియాలోని జె.వి.ఆర్ ఓసి-2, బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూడ ఓపెన్‌కాస్ట్, రామగుండం-3 ఏరియాలోని ఆర్.జి ఓసి-1 గనులు అత్యుత్తమ 5-స్టార్ రేటింగ్‌ను దక్కించుకున్నాయి.

గత ఏడాది నాలుగు గనులకు మాత్రమే ఈ గుర్తింపు లభించగా, ఈసారి 2024-25 సంవత్సరానికి సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా ఐదు గనులు 5-స్టార్ రేటింగ్ సాధించడం విశేషంగా నిలిచింది. అంతేకాకుండా మరో 17 గనులు 4-స్టార్ రేటింగ్ పొందాయి. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ప్రతి ఏడాది నిర్వహించే ఈ మూల్యాంకనంలో గనుల పనితీరు, రక్షణ ప్రమాణాలు, కార్మిక సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, గని ప్రభావిత గ్రామాల అభివృద్ధి, ఆధునిక సాంకేతిక వినియోగం, ఆర్థిక నిర్వహణ వంటి 7 ప్రధాన విభాగాల్లోని 50 అంశాలను సమగ్రంగా పరిశీలిస్తారు. నూటికి 90 శాతానికి పైగా మార్కులు సాధించిన గనులకే 5-స్టార్ రేటింగ్ ప్రదానం చేస్తారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి యాజమాన్యం, అధికారులు, కార్మికులు, సిబ్బందిని అభినందించారు. క్రమశిక్షణ, రక్షణ, కార్మిక సంక్షేమం, పర్యావరణహిత చర్యలను సమర్థంగా అమలు చేస్తూ రాష్ట్ర అవసరాలకు తగిన బొగ్గును సురక్షితంగా అందిస్తున్నందుకే ఈ జాతీయ గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని గనులు కూడా 5-స్టార్ రేటింగ్ సాధించాలని ఆకాంక్షించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like